ధోని - నాట్ అవుట్ .... రివ్యూ ...
ప్రకాష్ రాజ్ మొదటి సారి తెలుగు లో దర్శకుడిగా తీసిన సినిమా అన్న కారణంతో చూసిన సినిమా . హాల్ లో జనాలు లేరు ... సినిమాలో ఐటెం సాంగ్స్ లేవు ... హీరోయిన్ అప్పుడప్పుడూ వచ్చి అడవిమనుషుల బట్టలు వేసుకుని డాన్సు చెయ్యటం లేదు ... ఇరవై సుమోలు గాలిలోకి లేచి కిందపడటం లేదు .. ప్రకాష్ రాజ్ వాళ్ళ వంశం కోసం ఒక పంచ్ డైలాగు కూడా చెప్పలేదు . ఎందుకంటే ప్రకాష్ రాజ్ కు వంశం , కులం , అడ్రస్సు అన్ని సినిమా కనుక నిజాయితీగా ఒక సినిమాను తీయటానికి ప్రయత్నించాడు . అందులో వంద శాతం గెలిచాడా లేదా అన్న విషయం చెప్పలేక పొవచు కానీ , అతని నిజాయితీ మాత్రం గెలిచింది .
కధ లోకి తొంగిచూస్తే ... ఒక మధ్యతరగతి మనిషి , పెళ్ళాం చనిపోయింది , గవర్నమెంట్ ఆఫీసు లో క్లర్క్ ఉద్యోగం .
చాలని జీతం . పెరుగుతున్న అవసరాలు . నేలాఖరిలో అప్పు . పార్ట్ టైం పచళ్ళు అమ్మటం . ఇద్దరి పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలన్న మధ్య తరగతి మనిషి ఆరాటం . ఆ కలను నెరవేర్చడానికి ఇష్టం లేని క్రికెట్ అంటే ఇష్టం ఉన్న కొడుకు . ఒక్కగానొక్క కొడుకు ఎక్కడ నొచ్చు కుంటాడో అని మెత్తగా సర్దిచేప్పాలని తపన పడే తండ్రి . సబ్జెక్టు లు సరిగ్గా అప్పజెప్పకపోతే ఆ కుర్రవాడు జీవితంలో ఎందుకూ పనికిరాడని ముద్ర వేసే స్కూలు టీచర్లు , ప్రిన్సిపాల్ . ఒక రోజు కుర్రవాడి విషయం ఒక కొలిక్కి వస్తుంది . వాడు సరిగ్గా చదవటం లేదని , స్కూల్ నుంచి తీసేస్తామని ప్రిన్సిపాల్ చెప్తాడు . కోపం తట్టుకోలేని తండ్రి కుర్రాడిని కొడతాడు. తగలరాని చోట దెబ్బతగిలి ఆ కుర్రాడు కోమా లోకి వెళ్ళిపోతాడు . తరువాత జరిగే పరిణామాలే కధ .
ప్రకాష్ రాజ్ తన అనుభవంతో , కధను నమ్ముకుని తీసిన సినిమా . మంచి ఆర్టిస్ట్ లను తీసుకుని అందంగా వారిని వాడుకున్నాడు . చదువు అంటే జ్ఞానాన్ని పెంచాలి కానీ , బట్టి పట్టడం కాదు అని చాల రోజులుగా ఎంతో మంది చెప్తూ వస్తున్న ఒక బర్నింగ్ పాయింట్ ను చెప్పటానికి నిజాయితీగా ట్రై చేసాడు . మురళి శర్మ , శ్రీ. గొల్లపూడి మారుతీ రావు , రాధిక ఆమ్టే, ఆకాష్ , నాజర్ వీళ్ళంతా సినిమా కు చాలా బలం.
దేవుడు ఈ సినిమా కు సంగీతం అందించాడు . ఒక పాట కూడా పాడాడు . నేను చెప్తున్నది ఇళయరాజా కోసం . మంచి గిటార్ , పియనో, వాయులీనం ఉపయోగించి ఆ మహానుభావుడు ఇచిన నేపథ్య సంగీతం ..చాల రోజుల తరువాత చెవులకు అమృతం . గుహన్ కెమేర చక్కగా ఉంది. మధ్య తరగతి కుటుంబీకుడిగా ప్రకాష్ రాజ్ నటన అధ్బుతం . రాధిక ఆమ్టే తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది . ఆ మల్లెల నవ్వుకు వేయి వందనాలు.
భాయ్ లు, విదేశి లోకేషన్లు , తుపాకులు , తొడలు , బొడ్లు, రక్తం , ఫిలోసఫి ,ఫైట్లు ,పోలియో వచ్చినట్లు వంకర టింకర డాన్సులు , ఇష్టపడే ప్రేక్షకులు మీరైతే ఈ సినిమాకు మీరు వెళ్ళటం పెద్ద బొక్క . సినిమా అనేది ఎమోషన్ ను చూపించే ఒక విద్య గా మీరు భావించే వారైతే , మీకు ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే కచితంగా చూడదగిన సినిమా ఇది.
మంచి సినిమాలు కావాలని, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు కరువయ్యాయని F .M రేడియో లలో వాపోవటం , టీవీ షో ల లోడైరెక్టర్ లను తిట్టటం మానేసి .. ఇలాంటి సినిమాలు చూసి తీసిన వాడికి ఒక నమ్మకం కలిగిస్తే మంచి సినిమాలు తీయాలని అనుకున్నవారికి ఒక ధైర్యం వస్తుంది .... ఇదంతా ఉట్టిదే ..మన సినిమా లు హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళాలి అనుకునేవాళ్ళకు నేను చెప్పగలిగిందేమి లేదు ..ఒక పెద్ద నమస్కారం పెట్టడం తప్ప ..
P.S : ఇది నా చిన్న బుర్రకు ఈ సినిమా ఎలా నచ్చింది అన్నది చెప్పే ప్రయత్నమే తప్ప .. ఎవరిని పొగడాలని కాని, తిట్టాలని కాని ..విమర్శించాలని కానీ అనుకుని రాసినది కాదు. ఇంకా మీకు అలా ఏమైనా అనిపిస్తే మీ ఇష్టం ...ఉంటాను.. సెలవు
3 కామెంట్లు:
చాలా చక్కగా రాసినందుకు అభినందిస్తునాను
మంచి సినిమాకి మంచి రివ్యూ...
ఈ సినిమా నేణు చూడలేదు గానీ సాంగ్స్ అలా అరగదీస్తూ ఉన్నా ఈరోజు వరకూ.. బెస్ట్ రివ్యూ అనుకుంటా.. ఈ సినిమా మీద చదివిన వాటిలో
నాకు పిచ్చిగా నచ్చిన లైన్స్
>>దేవుడు ఈ సినిమా కు సంగీతం అందించాడు . ఒక పాట కూడా పాడాడు>>
కామెంట్‌ను పోస్ట్ చేయండి