17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

NIPPU - REVIEW

నిప్పు  - రివ్యూ


గుణశేఖర్ తీయాలనుకున్న కధ ( నా చిన్న బుర్రకు తట్టినది , నేను అర్ధం చేసుకుని , ఊహించుకున్నది )


రాజా గౌడ్  హైదరాబాదు  ను శాసించే ఒక పెద్ద రౌడీ . అతనికి ఒక భార్య . ఇద్దరు కూతుళ్ళు . పెద్దమ్మాయి దుబాయి లో ఉద్యోగం చేస్తుంది . చిన్నమ్మాయికి ఒక కాలు అవిటి .  భార్య చాల గయ్యాళి . పెద్దమ్మాయి  దుబాయిలో శ్రీరాం అనే వ్యక్తి తో ప్రేమలో పడుతుంది . ఒక సాయంత్రం ఇద్దరూ ఒక 21 అంతస్తుల భవనం మీద రొమాంటిక్ గా సరదాగా గడుపుతుండగా ప్రమాదవసాత్తూ  ఆ అమ్మాయి  పై నుండి పడిపోయి చనిపోతుంది . కానీ ఆ అమ్మాయిది ప్రమాదవశాత్తూ  జరిగిన మరణం కాదని , శ్రీరాం ఆ అమ్మాయిని చంపేసాడని దుబాయి కోర్ట్ నమ్మి , అతనికి ఉరిశిక్ష వేస్తుంది . శ్రీరాం కు  ఒక మంచి ఫ్యామిలీ ఉంది ఇండియా లో . ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ కు తెలీదు . శ్రీరాం కు ప్రాణ స్నేహితుడైన  సూర్య ( రవితేజ ) స్నేహితుడి పుట్టినరోజు కోసం దుబాయి వెళితే  ఈ విషయం తెలుస్తుంది . మరి శ్రీరాం ను రక్షిచుకోవటం ఎలా  అని ప్రయత్నిస్తున్న సూర్య కు , చనిపోయిన అమ్మాయి తల్లితండ్రులు  క్షమాబిక్ష పత్రం పై సంతకం పెడితే శ్రీరాం శిక్ష రద్దు అవుతుంది అని తెలుస్తుంది . సో సూర్య ఆ భాద్యతను భుజాల  మీద వేసుకుని ఇండియా వస్తాడు ....


అసలు  సూర్య ఎవరు అంటే .. శ్రీరాం కు ఫ్రెండ్ , శ్రీరాం చిన్న చెల్లెలను( దీక్ష సెత్ ) ప్రేమిస్తుంటాడు . హైదరాబాద్ లో ఒక ఫిట్ నెస్  సెంటర్ నడుపుతుంటాడు . కష్టాల్లో ఉన్న వారిని తన కండబలంతో, మంచితనంతో ఆదుకుంటూ ఉంటాడు . ఈ క్రమంలో ఒక సారి రాజా గౌడ్ తో తలపడి , అతని సామ్రాజ్యాన్ని, అతని వ్యాపారాన్ని  కూలగొట్టి రాజా గౌడ్ కు ప్రధాన శత్రువు అవుతాడు . ఇప్పుడు అదే రాజ గౌడ్ దగ్గరకు వెళ్లి తన స్నేహితుడి ప్రాణాల్ని కాపాడమని అడగాల్సిన పరిస్థితి . కాని రాజ గౌడ్ కోరుకునేది సూర్య చావుని . ఈ పరిస్థుతలను సూర్య ఎలా తట్టుకుని అధిగమించి తన స్నేహితుడి ప్రాణాలు కాపాడి, తన ప్రేయసిని దక్కించుకున్నాడు అన్నదే కధ ....


కధను చదివారు కదా .. ఈ కధను గుణశేఖర్ ఎలా తెర మీద చూపించాడో  ఇప్పుడు చూద్దాం :


సినిమా మొదలైంది ... పేర్లు వేసారు ... ముగ్గురు  పేరుమోసిన రౌడీలు వచ్చి ఒక బిల్దర్ కు మామూలు అడిగారు . కట్ చేస్తే  హీరో ఎంట్రీ ... 8  ట్రాన్స్ ఫార్మర్లు  పేలిపోయాయి ... 29 సుమో లు  గాల్లోకి లేచిపోయాయి .. దాదాపు 200 మంది కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు.. హీరో అసలు బండి దిగలేదు .. చొక్కా నలగలేదు ... క్రాఫ్ చెదరలేదు ... ఫైటు అయిపోగానే  హీరో గారు  పూర్తిగా తడిగా , నీళ్ళు నిండి ఉన్న సెల్లార్ల లో బాగా ట్యూబ్ లైట్ లు వెలిగించి .. వాటిమధ్య  తన ప్రతాపాన్ని వర్ణిస్తూ ఒక పాత పాడాడు .. మధ్య మధ్య లో చలి జ్వరం వచినట్లు వణికిపోతూ డాన్సు చేసాడు ...  తరువాత విలన్ వచ్చాడు .. పైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ లాగ అరుస్తూ కాసేపు మాట్లాడాడు .. వెంటనే హీరోయిన్ వచ్చి బొడ్డును , తొడలను చూపిస్తూ ఎక్సర్ సైజులు  చేసింది .. ఆ తర్వాత  హీరో దుబాయ్ వెళ్ళాడు .. పదిరోజుల తరువాత వచ్చాడు .. పెద్ద ఫైటు .. వెంటనే  లండన్ వెళ్లి ఒక పాట పాడాడు. వెనకాతల  రష్యన్ అమ్మాయిలు  " తుర్ర్ర్రర్ ...పుర్ర్ర్ర్ ..గుర్ర్ర్ " అంటూ మధ్య మధ్యలో అరిచారు . హాల్లో నుంచి చాల మంది జనం బయటకు వెళ్లారు . సమోసా లు బాగా అమ్ముడు పోయాయి బయట . పాట  అయిపొయింది . విలన్ కు మళ్లీ పైల్సు వచ్చాయి . రాజేంద్ర ప్రసాద్ హీరో ను తిట్టాడు . హీరో ఫైటు చేసాడు .. ఇంటర్వల్ ... నేను బయటకు వచ్చాను ... చాల మంది ముఖాల్లో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగుట్టుకున్న ఫీలింగ్ కనిపించింది ( నా భ్రమా ? )  


మళ్లీ సినిమా స్టార్ట్ అయింది . హీరో హీరోయిన్ ను బయటకు తీసుకువెళ్తాను అని చెప్పి బయటకు తీసుకు వచ్చాడు. ఇద్దరూ పాట మొదలెట్టారు .. హాల్లో జనం లో 85 % బయటకు వెళ్ళిపోయారు .. హీరో పెద్ద ఫైటు చేసాడు ... ఆ క్రమంలో సూపర్ మాన్, హి మాన్ , spyderman  అందరినీ మించే అధ్బుత సాహసాలు చేసాడు ... కాసేపటకి హీరోయిన్ కు నిజం చెప్పాడు ( ఏంటి అని నన్ను అడగొద్దు ప్లీజ్ ) .. హీరోయిన్ ఏడుస్తుంది ... నాకు వాంతి వస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలిగింది .. ఈ లోగ బ్రహ్మానందం వచ్చి కామెడీ అన్న పేరుతో కాసేపు వికారంగా ప్రవర్తించి వెళ్ళిపోయాడు ...( మీరు కొంచం రోజులు రెస్ట్ తీస్కోండి సార్ ) వెంటనే హీరోయిన్ జాతీయ స్థాయిలో  అథ్లెటిక్  చాంపియన్ అయిపొయింది ,, ఆ ఆనంద భాష్పాల మధ్య ఒక పాట పాడుకున్నారు .. హీరో ఫైటు చేసాడు ... వెంటనే ఫ్యామిలీ సాంగ్ స్టార్ట్ అయింది ... అందులో  328 బొడ్లను, క్లోజ్ అప్ లో చూపించారు . ( భగవంతుడా ).. వెంటనే విలన్ వచ్చి  రాజేంద్ర ప్రసాద్  ఫ్యామిలీ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు ... విలన్ కు శత్రువు వచ్చి విలన్ మీద ఎటాక్ చేసాడు ... హీరో రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ను  రక్షించి విలన్ ను కూడా కాపాడాడు ... ఈ లోగా హీరో ఫ్రెండ్ దుబాయి నుంచి  హైదరాబాద్ వచ్చాడు ... విలన్ వచ్చి హీరో ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసాడు ... హీరో వెళ్లి ఫైటు చేసాడు ...  విలన్ మారిపోయి అందర్నీ ఆశీర్వదించాడు ... నాకు గుండెలలో ఎవరో గునపం దించినట్లు అనిపించింది .. హాల్ నుంచి బయటకు వచ్చాను ... ఇంటికెళ్ళి  మిరియాల కషాయం తాగి  పడుకున్నాను ... శుభం..


ఇందులో రివ్యూ కావాలని మీకు అనిపిస్తే  పైన చెప్పిన కధను  కింద చెప్పిన సీన్లకు  అతికించుకుని ఊహించుకోగలరు ...  ఒక్క ముక్కలో చెప్పాలంటే "నిప్పు " ఒక సినిమా కాదు ... ఒక ఆయుధం ...ఒక శక్తి..
ఒక మందు ..... సర్వరోగ నివారణి.. రెండు సార్లు ఈ సినిమా ను  చూస్తే కరుడుగట్టిన తీవ్ర వాది కూడా నిజాలు చెప్పి , లొంగిపోవటం ఖాయం ... దీనిని ఇండియన్ మిలిటరీ  సైనికులకు  చూపిస్తే .. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నైన అవలీలగా ఎదుర్కొనే మానసిక సామర్ధ్యం పెరుగుతుంది ... ఇటువంటి ఆణిముత్యాన్ని అందించిన  గుణశేఖర్ కు , నిర్మించిన  చౌదరి కు , స్నేహానికి విలువ నిచ్చి  కధ వినకుండా నటించిన రవితేజ కు  తెలుగు సినిమా , తెలుగు జాతి రుణపడి ఉంటుంది .... 


**** నా పిచ్చి నాకు ఆనందం అన్న కాన్సెప్ట్ తో రాసిన ఈ రివ్యూ .. ఎవరిని నొప్పించడానికి కాని , ఎవరిపైనా  ద్వేషం తో కాని రాసినది కాదు అని సవినయంగా మనవిచేసుకుంటున్నాను ... సర్వేజన సుఖినోభవంతు .. 













11, ఫిబ్రవరి 2012, శనివారం

DHONI - REVIEW ( MY TAKE)


ధోని - నాట్ అవుట్ .... రివ్యూ ...


ప్రకాష్ రాజ్ మొదటి సారి తెలుగు లో  దర్శకుడిగా తీసిన సినిమా అన్న కారణంతో చూసిన సినిమా . హాల్ లో జనాలు లేరు ... సినిమాలో ఐటెం సాంగ్స్ లేవు ... హీరోయిన్ అప్పుడప్పుడూ వచ్చి అడవిమనుషుల బట్టలు వేసుకుని డాన్సు చెయ్యటం లేదు ... ఇరవై  సుమోలు గాలిలోకి లేచి  కిందపడటం లేదు .. ప్రకాష్ రాజ్ వాళ్ళ వంశం కోసం ఒక పంచ్ డైలాగు కూడా చెప్పలేదు . ఎందుకంటే ప్రకాష్ రాజ్ కు  వంశం , కులం , అడ్రస్సు  అన్ని సినిమా కనుక నిజాయితీగా ఒక సినిమాను తీయటానికి ప్రయత్నించాడు . అందులో వంద శాతం గెలిచాడా లేదా అన్న విషయం చెప్పలేక పొవచు కానీ , అతని నిజాయితీ మాత్రం గెలిచింది .

కధ లోకి తొంగిచూస్తే ... ఒక మధ్యతరగతి మనిషి , పెళ్ళాం చనిపోయింది , గవర్నమెంట్  ఆఫీసు లో క్లర్క్ ఉద్యోగం .
చాలని జీతం . పెరుగుతున్న అవసరాలు . నేలాఖరిలో అప్పు . పార్ట్ టైం పచళ్ళు అమ్మటం . ఇద్దరి పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలన్న మధ్య తరగతి మనిషి ఆరాటం .  ఆ కలను నెరవేర్చడానికి ఇష్టం లేని క్రికెట్ అంటే ఇష్టం ఉన్న కొడుకు . ఒక్కగానొక్క కొడుకు ఎక్కడ నొచ్చు కుంటాడో అని మెత్తగా సర్దిచేప్పాలని తపన పడే తండ్రి . సబ్జెక్టు లు సరిగ్గా అప్పజెప్పకపోతే ఆ కుర్రవాడు జీవితంలో ఎందుకూ పనికిరాడని ముద్ర వేసే స్కూలు టీచర్లు , ప్రిన్సిపాల్ .  ఒక రోజు కుర్రవాడి విషయం ఒక కొలిక్కి వస్తుంది . వాడు  సరిగ్గా చదవటం లేదని , స్కూల్ నుంచి తీసేస్తామని  ప్రిన్సిపాల్ చెప్తాడు . కోపం తట్టుకోలేని తండ్రి కుర్రాడిని కొడతాడు. తగలరాని  చోట దెబ్బతగిలి ఆ కుర్రాడు కోమా లోకి వెళ్ళిపోతాడు . తరువాత జరిగే  పరిణామాలే కధ .

ప్రకాష్ రాజ్ తన అనుభవంతో , కధను నమ్ముకుని తీసిన సినిమా . మంచి ఆర్టిస్ట్ లను తీసుకుని అందంగా వారిని వాడుకున్నాడు . చదువు అంటే జ్ఞానాన్ని పెంచాలి కానీ , బట్టి పట్టడం కాదు అని చాల రోజులుగా ఎంతో మంది చెప్తూ వస్తున్న ఒక బర్నింగ్ పాయింట్ ను చెప్పటానికి నిజాయితీగా ట్రై చేసాడు . మురళి శర్మ , శ్రీ. గొల్లపూడి మారుతీ రావు , రాధిక ఆమ్టే, ఆకాష్ , నాజర్ వీళ్ళంతా సినిమా కు చాలా బలం.

దేవుడు ఈ సినిమా కు సంగీతం అందించాడు . ఒక పాట కూడా పాడాడు . నేను చెప్తున్నది ఇళయరాజా కోసం . మంచి గిటార్ , పియనో, వాయులీనం  ఉపయోగించి  ఆ మహానుభావుడు ఇచిన  నేపథ్య సంగీతం  ..చాల రోజుల తరువాత చెవులకు అమృతం . గుహన్ కెమేర చక్కగా ఉంది. మధ్య తరగతి కుటుంబీకుడిగా ప్రకాష్ రాజ్ నటన అధ్బుతం . రాధిక ఆమ్టే తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది . ఆ మల్లెల నవ్వుకు  వేయి వందనాలు.

భాయ్ లు, విదేశి లోకేషన్లు , తుపాకులు , తొడలు , బొడ్లు, రక్తం , ఫిలోసఫి ,ఫైట్లు ,పోలియో వచ్చినట్లు వంకర టింకర డాన్సులు , ఇష్టపడే ప్రేక్షకులు మీరైతే ఈ సినిమాకు మీరు వెళ్ళటం పెద్ద బొక్క . సినిమా అనేది ఎమోషన్ ను చూపించే ఒక విద్య గా మీరు భావించే వారైతే  , మీకు ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే  కచితంగా చూడదగిన సినిమా ఇది.

మంచి సినిమాలు కావాలని, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు కరువయ్యాయని  F .M రేడియో లలో  వాపోవటం , టీవీ షో ల లోడైరెక్టర్ లను తిట్టటం మానేసి .. ఇలాంటి సినిమాలు చూసి తీసిన వాడికి ఒక నమ్మకం కలిగిస్తే  మంచి సినిమాలు తీయాలని అనుకున్నవారికి ఒక ధైర్యం వస్తుంది .... ఇదంతా ఉట్టిదే ..మన సినిమా లు హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళాలి  అనుకునేవాళ్ళకు నేను చెప్పగలిగిందేమి లేదు ..ఒక పెద్ద నమస్కారం పెట్టడం తప్ప ..

P.S : ఇది నా చిన్న బుర్రకు  ఈ సినిమా ఎలా నచ్చింది అన్నది చెప్పే ప్రయత్నమే తప్ప .. ఎవరిని పొగడాలని కాని, తిట్టాలని కాని ..విమర్శించాలని కానీ అనుకుని రాసినది కాదు. ఇంకా మీకు అలా ఏమైనా అనిపిస్తే  మీ ఇష్టం ...ఉంటాను.. సెలవు