8, ఏప్రిల్ 2013, సోమవారం



బాద్ షా ...... శ్రీను వైట్ల గారి ఆల్ మిక్సర్ ధమాకా 



                    ప్రపంచం మొత్తం మీద 7 కధలు ఉన్నాయి వాటిని అటూ ఇటూ తిప్పి  సినిమాలు తీయాలని ఆ మధ్య పరుచూరి గోపాలకృష్ణ  ఏదో సినిమా ఫంక్షన్ లో చెప్పినట్లు గుర్తు ...  దానిని దర్శకుడు శ్రీను వైట్ల గారు పూర్తిగా తీసుకోకుండా ఒకే కధ తో తీసిన మరో సినిమా ఈ బాద్ షా ... 

                తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసారని కొంతమంది , అబ్బే ఏమి లేదు అని ఇంకొంతమంది , బ్రహ్మానందం లేకపోతే సినిమా వేస్ట్ అని ఇంకొంతమంది , టైం పాస్ అని కొంతమంది చెప్పడం వలన  బుర్ర పాడయ్యి , కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం  చలువ వలన ఇంట్లో కరెంటు పోయి , గాలి లేక  ఎసి కు కక్కుర్తి పడి  సినిమా ధియేటర్ కు వెళ్తే దూల దీరి దుకాణం తెరువబడింది ... 

ఇక కధ  కోసం చెప్పుకోవాలంటే ..... స్టార్టింగ్ లో  షిప్ మీద  వెనకాతల అగ్ని గోళం  మండుతుండగా ., డాన్ బాద్ షా  ఒక ఫైట్ చేస్తాడు .... కట్ చేస్తే  మిలన్ వెళతాడు .. అదేంటో అక్కడంతా తెలుగులోనూ  చక్కగా మాట్లాడుతుంటారు . పాపం తెలుగు హీరోయిన్ లు అందరూ చేసినట్లే కాజల్ అగర్వాల్ ఆంటీ  అక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తుంటారు . మన హీరో గారు అక్కడ ఆమె  ప్రేమను పొందటం కోసం ఏదో నాటకం ఆడుతుంటారు . మధ్యలో రష్యన్ అమ్మాయిలతో  పాము కరిచి చలి జ్వరం వచినట్లు  డాన్సు లతో కొన్ని పాటలు .  ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ .. అందులో బోలెడు కిచడీ  కలిపి పాత సినిమాల్లోని కొన్ని సీన్లు , వైట్ల గారి ట్రేడ్ మార్క్.....   ఎవరినో ఒక సినిమా సెలబ్రిటీ ను కించపరుస్తూ / అనుకరిస్తూ /పేరడీ  చేస్తూ కొన్ని సీనులు . ఈ సరి రామ్ గోపాల్ వర్మ మరియు రాజమౌళి  బలి . 

మళ్ళీ కట్ చేస్తే హాంగ్ కాంగ్ .. అక్కడ అంతా హిందీ మాట్లాడుతుంటారు ... నేను చెప్తున్నది హాంగ్ కాంగ్ వాళ్ళ కోసమే సుమా .... విలన్ హెలికాప్టర్ లో తిరుగుతూ కన్సైన్మేంట్  ను ఎక్కడ కావాలంటే అక్కడ దింపమని వెనకాతల ఉన్న బాగా బలిసిన  గూండాలకు చెప్తూ ఉంటాడు . దానిని మన హీరో ఒంటి చేత్తో సాధించి  హాంగ్ కాంగ్ ను తనకు ఇచెయ్యమని అడుగుతాడు . విలన్ ఇచ్చేస్తాడు . హైదరాబాద్ వచ్చి  పాతికేళ్ళు అయిన తరువాత కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు . కాని మన హీరో ఒకే నెల రోజుల్లో  హాంగ్ కాంగ్ ను  సాధిస్తాడు . హాంగ్ కాంగ్ అంతా అతనిదే . తరువాత అదే విలన్ హీరో తనను మోసం చేసాడని తెలుసుకుని  అతన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు .ఇక మెయిన్ విలన్ కాకుండా ఒక డజన్ మంది విలన్ లు ఉన్నారు . వాళ్ళందరూ ఆజానుబాహువులు ., వాళ్ళందరూ హీరో చేతిలో తన్నులు తింటూ , చచిపోతూ ఉంటారు ...ఫ్లాష్ బ్యాక్ వస్తుంది . అది అయిపోగానే  హీరో , కాజల్ ఆంటీ , మిగతా బాచ్  అందరూ ఇండియా వచేస్తారు .  ఇంటర్వెల్ 
 
ఇంటర్వెల్ తరువాత  బ్రహ్మానందాన్ని  బకర చేసే ప్రోగ్రాం . సినిమా చివరికంతా బ్రహ్మానందం నిజం తెలుసుకునే టప్పటికి లాస్ట్ ఫైట్ . హీరో హీరోయిన్ ల పెళ్లి . శుభం .... 

ఈ మధ్యలో టీవీ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం ఒక ఎపిసోడ్ చూసినా ., ఈ సినిమా చూసినా ఒకటే . ఈ సినిమాకు  ఎన్టీఆర్ అవసరం లేదు . అంత బిల్డప్ అవసరం లేదు . చక్కటి ఉంగరాల జుట్టు తో ఉంటె ఎన్టీఆర్ ను  స్టైలింగ్ పేరుతోమామిడి టెంక నాకినట్లు ఒక  ఎఫెక్ట్ తో హెయిర్ స్టైల్ డిజైన్  చేసారు . సినిమాలో సింహ భాగం ఎన్టీఆర్  బ్లాకు కలర్ ప్యాంటు వేసుకున్నాడు . తమన్ సంగీతం కర్ణ హింస . స స స .. డి స స ..బ బ బ బాద్ శ ..ఇదె బిట్టును అటు తిప్పి ఇటు తిప్పీ  చావ గొట్టాడు ....పాటలైతే  అన్నీ బాగా శ్రద్ధ గా కాపీ కొట్టాడు .   కాజల్ ఎన్టీఆర్ పక్కన అక్కలా ఉంది . బోలెడు తారా  గణం . విషయం తక్కువ .. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువ ... మొత్తానికి శ్రీను వైట్ల  సామను సర్దుకునే  సినిమా ఒకటి తీసాడు .. చూస్తారో చూడరో మీ ఇష్టం .. 

ధియేటర్ లోంచి బయటకు  వస్తున్నప్పుడు ఒకటి అనిపించింది ... ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళ కోసం , ఆడియో ఫంక్షన్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కుర్రాడు ..వాళ్ళ కుటుంబం జ్ఞాపకం వచ్చి మనసు చాల బాధ పడింది 

ఇది ఎవ్వరిని నొప్పించడానికి రాసింది కాదు ... నా మనసు నొచ్చు కోవటం వలన రాసిన  నా వ్యూ ... శ్రీను వైట్ల సినిమా లోంచే ఒక వాక్యం తో ఇది ముగిస్తాను .. 

" ఇలాంటి సినిమాలు చూస్తుంటే  తెలుగు సినిమా చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది "

 










24, జనవరి 2013, గురువారం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు -  నాకు అర్ధమైన సినిమా 





సంక్రాంతి కి  మన తెలుగు సినిమా పరిశ్రమ మాఫియా పుణ్యమా అని రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. చచ్చినట్లు అవి తప్ప చూడటానికి ఇంకే సినిమాలు లేవు . సరే చూద్దాం అని వెళితే  2 వారాలు అసలు టికెట్లు దొరకలేదు . నా టైం బాగోక  మాదాపూర్ హై టెక్ లో నైట్ షో కు టికెట్ దొరికింది. చాల భారీ అంచనాలతో  రిలీజ్ అవ్వటం. మహేష్ , వెంకటేష్ ఇద్దరూ నటించిన మల్టీ స్టారర్  అవ్వటం, హిట్ టాక్ రావటం తో నేను కూడా చక్కగా భోజనం చేసి  పాన్ దట్టించి ధియేటర్ లో కూర్చున్నా .

ఇక కధ  లోకి వెళితే :

రేలంగి ఇంటిపేరు గల ఒక కుటుంబం . తండ్రికి పేరు లేదు , కొడుకులిద్దరికీ పేర్లు లేవు .  ఆ కుటుంబంలో తండ్రి ఎంతసేపు నవ్వుతూ , తెల్ల చొక్కా వేసుకుని , చెరువు గట్టు మీద  నడుస్తూ, మార్కెట్ లో నడుస్తూ, వచ్చే పోయే వాళ్ళను పలకరిస్తుంటాడు ( నవ్వుతూ ). ఈ  రోల్ ప్రకాష్ రాజ్ గారు పోషించారు .అతనికి ఇద్దరు కొడుకులు . పెద్దవాడు పని చెయ్యటానికి ఇష్టపడడు . అదేంటో పై ఆఫీసర్ కు గుడ్ మార్నింగ్ చెప్పటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తిన్నగా ఉద్యోగం చెయ్యడు . ఉద్యోగం మానేసి ఊరికి వచ్చి మొహం ఎప్పుడూ దిగాలుగా పెట్టుకుని మేడ మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు . చిన్నవాడు  హైదరాబాద్ లో ఉంటాడు . రివ్వుమని ఎప్పుడు పడితే అప్పుడు ఊరికి వచేస్తుంటాడు . వచ్చి అన్నయ్య ను మౌనంగా ప్రేమిస్తుంటాడు . అన్నయ్య గారు ఇతనిని ఇంకా మౌనంగా ఆరాధిస్తూ  ఉంటాడు . ఇద్దరూ ఇలాగె గడుపుతూ ఉంటారు . ఇంట్లో అమ్మగా జయసుధ . ఫ్రేమ్ లోకి వచినప్పుడల్లా వడియాలు పెడుతూ, బట్టలు ఉతుకుతూ, కాఫీ లు  కలుపుతూ , పిల్లలకు కి కుంభాలు వడ్డిస్తూ , నానా  హైరానా పడుతూ ఉంటుంది . ప్రకాష్ రాజ్ చెల్లి కూతురు  సీత  కారెక్టర్  అంజలి వేసింది . ఈ పనీ చెయ్యకుండా ఖా ళీ గా తిరిగే వెంకటేష్ ( పెద్దబ్బాయి ) ఈమె పై జులుం చేలయిస్తుంటాడు .  సీత ఎంత సేపు  తువ్వాలు తేవటం , నవ్వుల మావయ్య బయట నుంచి వస్తే  కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు అందించటం చేస్తూ ఉంటుంది. ఇక  ప్రకాష్ రాజ్ బావ గారు  విజయవాడ లో ఉంటారు  కుటుంబ  పెద్ద  రావు రమేష్ . అతను ఏదో వ్యాపారం చేస్తూ కొంచం బాగా సంపాదిస్తూ ఉమ్మడి కుటుంబం తో హాయిగా కాలం వెల్లదీస్తుంటాడు . వీలైనప్పుడు  రేలంగి కుటుంబం వాళ్ళను పని చేసుకుని చక్కగా ప్రయోజకులు గా ఉండమని సలహా ఇస్తూ ఉంటాడు . ఈ ఒక్క కారణం వలన  రావు రమేష్  అంటే ఎవరికీ పడదు . అంతకు మించి సినిమాలో అతను చేసిన తప్పు ఏమి కనిపించలేదు . కొంత కాలానికి అతను కూడా పలకరించుకుంటే  చాలు ఎం పనీ చెయ్యక్కర్లేదు  అని తెలుస్కుని వీళ్ళతో కలిసిపోతాడు .ఇంతే సినిమా.... ఇందులో కధ  ఇంతే.. దీనిని కధనం తో నడిపించారు .

నాకు అర్ధం కాని కొన్ని విషయాలు :

1. ఎం పనీ చెయ్యకుండా  నవ్వుతూ ఉంటె చాలని ప్రకాష్ రాజ్  రోల్ చెప్తూ ఉంది. కనీసం ప్రకాష్ రాజ్  పొలం పనో, తోట పనో చేయించి నట్లు చూపించిన బావుండేది. మరి ఇద్దరు పని చెయ్యని కొడుకులు, పెళ్ళాం, తల్లి, మేనకోడలు  ఏ  జీవనాధారం తో బ్రతుకుతున్నారో అసలు చెప్పలేదు . మధ్యలో గ్రాండ్ గా  అమ్మాయి పెళ్లి కూడా చేస్తారు . సరే  తాతలు ఇచిన ఆస్తులు ఉన్నాయి అనుకోవటానికి  లేదు. రావు రమేష్  అస్తమానం వీళ్ళు ఉన్నదంతా కరగాబెట్టి పాపర్లు  అయిపోయారని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు .

2. వెంకటేష్ సినిమా మొత్తం ఆముదం తాగినట్లు మొహం పెట్టుకున్నాడు . అతనికి ఎం కష్టం వచ్చింది . పని చెయ్యటానికి బద్ధకం . మాట పడకూడదు . సరే ... బానే ఉంది. కాని ఇంట్లో ఎవరికీ రూపాయి ఆదాయం లేకపోయినా తమ్ముడు ఊరికేల్లినప్పుడల్లా  జేబులో ఖర్చుకు కు నోట్ల కట్టలు పెడుతూ ఉంటాడు . ఈ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది ?

3. మహేష్ బాబు హైదరాబాద్ వెళ్తుంటాడు , ఊరికి వస్తుంటాడు . అన్నయ్యను వదిలి వెల్ల దానికి మనసు రాదు. కనిపించిన ప్రతి  అమ్మాయిని  గోకుతుంటాడు . పనేమైన చేస్తాడ అంటే హైదరాబాద్ లో ఎప్పుడూ రోడ్ల మీద తిరుగుతుంటాడు . అప్పుడప్పుడు ఇంటర్వూస్ కు వెళ్తుంటాడు .

4. సీత అంటే అంజలి ని ఉద్దరించినట్లు  ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు . జీతం లేని పనిమనిషి  కారెక్టర్  ఇచారు సీత అనే పాత్రకు తప్ప. ఒక ఉదాత్తత  ఏమి అన్వయించలేదు .

5. ప్రకాష్ రాజ్ దగ్గర భార్య పిల్లల కోసం మాట్లాడితే , వాళ్ళే చూసు కుంటారు  లేవే  అని అంటూ నవ్వుతుంటాడు . మనుషులు అందరు మంచోళ్ళు అని ఒక ఉచిత  జ్ఞానోపదేశం ఒకటి . చక్కగా పలకరించు కోవాలి అని అందరికి ఉపదేశిస్తూ ఉంటాడు .

6. ఇక పోతే సమంత . రావు రమేష్ కూతురు . మహేష్ బాబు ను ప్రేమిస్తూ ఉంటుంది . వాళ్ళ ఫ్యామిలీ  లో ఉన్న ఆడపిల్లలు ( సమంత కజిన్స్ )  బాగా దూల పురుగులు అన్నట్లు అందరూ  మహేష్ బాబు ను విపిరీతంగా
 కా మించేస్తూ ఉంటారు . దీనికి పేరు నేటివిటీ  అంట. అంటే  తూర్పు గోదావరి జిల్లా లో ఆడపిల్లలు బాగా అడ్వాన్స్డ్ గా ఉన్నారని చూపించటం దర్శకుని ఉద్దేశ్యం కాబోలు .

7. పాపం రావు రమేష్ .. అద్భుతమైన నటనను కనపరిచాడు . కాని సినిమాలో అతనే విల్లన్ . అతను చేసిన పాపం అంతా  వెంకటేష్ ను, ప్రకాష్ రాజ్ ను పని చేసుకుని సంపాదించుకుని  బాగా బ్రతకమని చెప్పటం .  ఈ మాత్రం దానికి అందరూ  అతని మీద  సీరియస్ అయిపోతూ ఉంటారు . వెంకటేష్ అయితే  అతన్ని చూడగానే కోపం తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు . ఎందుకో  నాకైతే అర్ధం కాలేదు . అల అని రావు రమేష్ సంపాదనలో అప్ది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసాడ అంటే అదీ లేదు . చక్కగా  కుటుంబాన్ని వెంటేసుకునిబయట  చక్కగా తిరుగుతూ, కుటుంబాన్ని జాగ్రతగా చూసుకుంటూ , వాళ్లకు అనీ అమర్చి అందులో ఆనందం పొందుతుంటాడు .

8.  తనికెళ్ళ భరణి గారిని, రవిబాబు ను కరివేపాకు ను వాడుకున్నట్లు  వాడుకుని వదిలేసారు . రవి బాబు సినిమా లో ఉండటం అసలు అనవసరం .

9. చివరి రీలు లో నైన వెంకటేష్ కు ఒక ఉద్యోగం వచ్చింది  అన్నది చూపిస్తారనుకుని చాలా ఎదురుచూసాను . నిరాశే మిగిలింది . ఇద్దరు కొడుకులు అలానే ఉన్నారు . వెంకటేష్ కు సీతను అంటే అంజలి  ని ఇచి పెళ్లి చేసారు .. శుభం ....

10. సినిమాకు  " సీతమ్మ వాకిట్లో నవ్వుల మామయ్య పలకరింత"  ..ఊరంతా  పులకరింత అనేది  సబ్ టైటిల్ పెట్టి ఉంటె బావుండేది అని నా వ్యక్తిగత అభిప్రాయము

ఇక సినిమా లో నాకు నచ్చినవి :

మణిశర్మ నేపధ్య సంగీతం . ఆరడుగులున్టాడ .. పాట ( మిక్కి జె మేయర్ ). సినిమా అంతా నిండుగా ఉండటం. మంచి ఫోటోగ్రఫీ .

ఇక ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యిందా అని ఆలోచించగా ..చించగా ..చించగా.. నాకు అర్ధమయ్యింది ఒకటే ...

జనాలు  మంచి  సినిమా కోసం మొహం వాచి  పోయి , వంశాల డైలాగులు విని, సుమోలు , కరంట్ స్థంబాలు

పే లిపోవటాలు  చూసి మొహం మొత్తి , రక్తము ..వంశ ప్రతిష్టలు , తొడలు, బొడ్లు , వికార మైన హాస్యం లేని ఈ సినిమా ను ఎడారిలో  మజ్జిగ  లాగా ఫీల్ అయ్యి హిట్ చేసారని నా నమ్మకం .

మొత్తం మీద మల్లె పువ్వు పూచింది  కాని వాసన రాలేదు ... శ్రీకాంత్ అడ్డాల కు హృదయపూర్వక శుభాకాంక్షలు .

సర్వేజన సుఖినోభవంతు ....


















10, నవంబర్ 2012, శనివారం

బొమ్మ  తుపాకి 

నేను ప్రస్తుతం  నివాసముంటున్న  అపార్ట్ మెంట్  కు రాత్రి చేరుకున్నప్పటికి  తొమ్మిది గంటలయ్యింది . బండి పార్క్ చేస్తుంటే   టప్  మన్న శబ్దం వినిపించింది . వెనక్కి తిరిగి చూస్తే వాచ్ మాన్ కొడుకు బొమ్మ తుపాకి తో ఆడుకుంటున్నాడు . దీపావళి దగ్గర పడుతోంది అన్న విషయం అప్పుడే జ్ఞాపకం వచ్చింది . లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ కు చేరుకొని  స్నానం చేసి  నప్పటికీ ఆ జ్ఞాపకం చెరిగిపోయింది . ఆకలి వేస్తుందో లేదో తెలియటం లేదు . కానీ  ఎదో ఒకటి తినాలి కదా . ఎదో తిన్నాను . ఎందుకు తింటున్నామో , ఎప్పుడు తింటున్నామో  తెలియకుండా జీవితం మెకానికల్ గా తయారయ్యింది . పడుకుంటే నిద్ర పట్టలేదు . అమ్మ జ్ఞాపకం వచ్చింది . ఆమెతో మాట్లాడి చాల రోజులయ్యింది . అమ్మతో పాటు కింద బొమ్మ తుపాకి తో ఆడుకుంటున్న కుర్రాడు , దీపావళి గుర్తుకు వచ్చాయి .

దీపావళి అంటే ఒక 25 ఏళ్ళ  క్రితం నాకు వేరేగా ఉండేది . దసరా అయిపోగానే 20 రోజులకు దీపావళి వస్తుంది అనేది ఒక బండ గుర్తు . దసరా అయిపోగానే మర్నాటి నుంచి నాన్నను 2 రూపాయల కోసం అడగటం మొదలు పెట్టేవాడిని . అది కూడా అమ్మ నోటితోనే అడగాలి . నాన్న ను ధైర్యంగా అడిగే సీన్ ఉందా మనకు అసలు . 2 రూపాయల కోసం  కనీసం 4 రోజులు వేచి చూడాల్సి వచ్చేది . నాన్న ఇచ్చిన రెండు రూపాయలను  భద్రంగా మురిసిపోతూ చూసుకుని  బజారుకు వెళ్లి  ఒక గన్ కొనుక్కుని వచ్చిన రోజు మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉండేది . అమ్మ వెనకాతలే తిరుగుతూ  అర్ధ రూపాయి ఇవ్వమని  అలా పోరు పెడుతుంటే అమ్మ 10 పైసలు ఇచ్చేది . నూకరాజు కోటలో  గన్ లో పెట్టె రీల్ అమ్మేవారు . ఒకటి పది పైసలు . అది కొనుక్కుని  ఆ రీల్ను కనీసం గంట  వాడే వాడిని. ఎదిరింటి హరి, పక్కింటి  బాలాజీ , వీధి లోని స్నేహితులు  నాగరాజు, శివాజీ , పురుషోత్తం , శ్రీను అందరం కలిసి మా వీధిలో ఉన్న నూతి గట్టు దగ్గర మనిషికో గన్ పట్టుకుని ఆడుకునే వాళ్ళం . అప్పుడు నేను చిరంజీవి , ఇంకొకడు  బాలకృష్ణ, ఇంకొకడు రావుగోపాల రావు , ఇంకొకడు ఇంకో  దుష్ట  పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు .
రీలు అయిపోగానే బిక్క మొహం వేసుకుని ఇంటికెళ్ళి అమ్మ ను మళ్ళీ బ్రతిమాలుకునే వాడిని . అమ్మకు తెలుసు అర్ధ రూపాయి ఒక్కసారి ఇస్తే నేను తగలబెట్టేస్తానని . పది పైసలు చెప్పున  ర్నాకు ఇస్తూ ఉండేది . మనసులో అప్పుడు ఒకటే కోరిక . ఎవరైనా చుట్టాలు వస్తే బావున్ను అని . చుట్టలోస్తే వెళ్ళేటప్పుడు  మన చేతిలో ఒక రూపాయో రెంద్ర్రూపాయలో పెట్టేవాళ్ళు . వద్దు వద్దు అని బయటకు అంటూ , మొహమాటంగా  అమ్మ వైపు నాన్న వైపు చూసేవాడిని. వాళ్ళు తీసుకో అంటే మనసులో గొప్ప సంబరం గా ఉన్నా బయటకు కనిపించకుండా మేనేజ్ చేసేవాడిని . చుట్టాలు వెళ్ళిపోగానే మనం చుక్కా మార్ . ఆ డబ్బులతో రీళ్ళు , దీపావళి అగ్గిపెట్టెలు, పాము మాత్తర్లు ( వెలిగిస్తే నల్ల గా ఒక గొట్టంలా బయటకు వస్తాయి) కొనుక్కుని అవి అపురూపంగా దాచుకునే వాడిని . మిగతా పిల్లలతో ఉన్నప్పుడు మన దగ్గర  ఏమున్నాయో చూపించి  చిన్న ఫోజ్ కొత్తోచు. అందుకన్న మాట .  మా కుటుంబానికి కొంచం దగ్గర బంధువు ఒక మామయ్య ఉండేవారు . అతను మొట్ట మొదటి ఇంజనీర్ మా ఊరిలో . అతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ఎవరూ అతనితో మాట్లాడే వారు కాదు . మా కుటుంబం ఒక్కటే వాళ్ళతో సన్నిహితంగా ఉండేది . దీపావళి అతను మట్టి కుమ్పీలతో చిచ్చు బుడ్లు తయారు చేసేవారు ( ఇప్పుడు వాటిని ఫ్లవర్ పాట్స్ అంటున్నారు ). స్కూల్ అయిపోగానే  వాళ్ళింటికి వెళ్లి అక్కడే కూర్చునే వాడిని . వాళ్ళు అప్పటికి మంచి సంపాదన పరులు., ప్రభుత్వ ఉద్యోగి కావటంతో వాళ్ళ ఇల్లు  పెద్దగ , మంచి ఫర్నిచర్ తో ఉండేది . పేదరికం వలన ఏర్పడే ఒక ఆత్మ నూన్యతా భావంతో వాళ్ళింట్లో  ముందు గదిలో ఒక మూలకు కూర్చుండే వాడిని. మామయ్యా ఆఫీస్ నుండి రాగానే   మెరిసే బూడిద రంగులో ఉన ఒక పదార్ధం, కొని మట్టి కుమ్పీలతో కూర్చునే వాడు , నేను అతని ఎం కావాలో సహాయం చేస్తుండే వాడిని . తా రోజుల్లో అతను దాదాపు 300 చిచ్చు బుడ్లు తయారు చేసేవారు . చివరి రోజు నాకు ఒక 5 చిచ్చు బుడ్లు , వాళ్ళు కోన దీపావళి సామాన్ల ( క్రాకెర్స్ ) లో కొంచం ఇచ్చేవాళ్ళు . నేను వాటికోసమే దీపావళి సమయంలో వాళ్ళింటికి వెళ్తానని ఆయనకు తెలుసు . దీపావళి కి వర్షం పడకూడదని మనసులో చాల మొక్కుకునేవాడిని . మా నాన్న గారు దీపావళి రోజు  సాయంత్రం బజారు నుండి ఒక కాకరపువ్వోత్తి  ప్యాకెట్ , ఒక అగ్గిపెట్టె ల ప్యాకెట్  ,  5 లక్ష్మి బాంబులు తెచ్చేవారు . అమ్మ ఇల్లంతా కడిగి  బయట వాకిల్లో కళ్ళాపి  జల్లి   సాయంత్రం  6 గంటలకంతా ముగ్గేసి పెట్టేది. నాన్న వచ్చిన తరువాత  చెరుకు ను చిన్న ముక్కలుగా నరికి  , వాటి చివరల్లో  గుడ్డ గతి, వాటిని నూనె లో ముంచి  ఆ ముగ్గు మధ్యలో పాతే వారు . వీధి మొత్తం అలానే  చేసేవారు. వీధంతా ఒక కొత్త కాంతి ఉండేది .  స్థితిమంతులు ఇల్లంతా దీపాలు పెట్టేవారు . వీధి లో మడపం ఎదురుగా ఉన్న నీలకంటం  గారు ఇంటికి, మండపానికి కలిపి దీపాలు పెట్టేవారు . వాళ్ళు దాదాపు 3 గంటల సేపు పటాసులు కాల్చే వాళ్ళు. జాగ్రతగా , పొదుపుగా ఎక్కువ సేపు కాల్చాలనే నా ఆలోచన, వీధిలో మొదటి పటాసు పేలగానే  మాయమైపోఎది . నా దగ్గరున్న పటాసులు  10 నిముషాల్లో అయిపోయేవి .మామయ్య ఇచ్చిన  చిచ్చుబుడ్లు  మాత్రం చాల బాగా కాలేవి . పటాసులు అయిపోగానే చాల నిరాశగా అనిపించేది . కాసేపటికి వీధిలో ఎవరు కాలుస్తున్నారో వాళ్ళ అరుగు దగ్గర నిలబడి తదేకంగా చూస్తూ ఉండేవాడిని . ఆ రాత్రి చాల తృప్తి గా ఉండేది . పటాసులు కలలో కొచ్చేవి .

చాల కాలం తరువాత  నేను మొదటి లక్ష  సంపాదించిన  తరువాత   5 వేల రూపాయల దీపావళి సామాన్లు కొని  దీపావళి జరిపాను . మా ఊరికి వెళ్ళాను . చిచ్చు బుడ్ల మామయ్య ఇంటికి వెళ్ళాను. ఆయన రిటైర్ అయిపోయారు . ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి . ఇప్పుడు తయారు చెయ్యటం లేదా అని అడిగితే అంత తీరిక ఎక్కడిది నాయన అన్నారు .  చిన్నప్పటి విషయాలు  గుర్తు   చేస్తే ఆయన కళ్ళలో ఒక ఉత్సాహం కనిపించింది . వాళ్ళ ఇద్దరి పిల్లలూ వాళ్ళ దగ్గర లేరు .  నేను 5 వేల రూపయల సామాను కాల్చినా నాకు పెద్ద ఉత్సాహం అనిపించలేదు . తరువాత  దీపావళి రెండు రోజులు ఉంది అనగా పిల్లలను తీసుకుని వెళ్లి వాళ్లకు ఇష్టమైన సామాన్లు కొని ఇస్తున్న . కాని ఎందుకో నేను అనుభవించిన  ఆ exisement  నా పిలలు అనుభవించటం లేదు అని అనిపిస్తోంది. చుట్టూ చూస్తే  అపార్ట్మెంట్లు . దీపావళి సాయంత్రం  మొక్కుబడిగా నాలుగు దీపాలు ముట్టించి అందరూ సెల్లార్ లో ఎవరి పార్కింగ్ లో వాళ్ళో , లేకపోతే బయటో  తూ తూ మాత్రం గా కాలుస్తారు . ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అదే ఎక్కువ . పిల్లలు కూడా ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు . మాకు మేమే , మీకు మీరే  చందాన దీపావళి అయిపోతోంది . ఆ తరువాత ఒక స్మశాన నిశ్శబ్దం . మళ్ళీ మర్నాడు పరుగులు,ఆఫీస్ , అప్పులు, స్కాం లు, స్కీం లు , పిల్లల ఫీసులు, ఆసుపత్రి ఖర్చులు , పెళ్ళానికి చీర, చంటోడికి పాల డబ్బా,మీడియా గోల , పాదయాత్రలు , పిజ్జాలు , మల్టీ ప్లెక్ష్ లు , షరా మామూలే . నా చిన్నప్పుడు , ఇప్పడు  దీపావళి ఒకేలా ఉందేమో .. నా దృష్టికి సరిగ్గా కనిపించటం లేదేమో కాని.. ఒకటి మాత్రం నిజం... అప్పుడు ఉన్నదీ , ఇప్పడు లేనిదీ  ఒకటుంది .. దాని పేరు  ఆనందం ...

- కరుణా కుమార్ 














8, జులై 2012, ఆదివారం


 ఈగ    రివ్యూ

చాలా రోజులుగా  ఊరిస్తూ , విడుదలకు ముందే కధను చెప్పిన రాజమౌళి  ఈ సినిమా తో చాలా దూరం వెళ్లి పోయాడు . ఈ సినిమా ద్వారా రాజమౌళి ఎం చెప్పాలనుకున్నారో నాకు తెలీదు కాని నాకు రెండు విషయాలను స్పష్టంగా  అతను చెప్పినట్లు అనిపించింది .
1 . వంశాలు,, ఆయుధాలు,, ఫాక్షన్ , \వంకర , \టింకర పోలియో డాన్సులు , ఐటెం సాంగ్  మాత్రమె  కమర్షియల్ సినిమా కాదు అన్నది .
2 . మనసులో సంకల్పం బలంగా ఉంటె ఈగతో కూడా సినిమా తీస్తాను , మీ తొక్కలో హీరోలు కూడా నాకు అక్కరలేదు అన్నది .( రోలింగ్ టైటిల్స్ లో ఈగ తో కొన్ని పాపులర్ సినిమా పాటల స్టెప్పులు వేయించాడు )

ఈ సినిమా కోసం విమర్శించే వాళ్లకు ఒక సామెత ఎలానూ ఉంది " పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు " అన్నది . హాలీవుడ్ లో గబ్బిలాన్ని , సాలేపురుగుని హీరో లుగా చూపించినప్పుడు  జబ్బలు చరుచుకుని కాఫీ డే లో కూర్చుని  ఆయా  సినిమాలను పొగిడే మేధావులారా , ఈ సినిమా కు  ఉన్న పరిమిత మార్కెట్ ను , వనరులను దృష్టిలో   పెట్టుకుని చూడండి . ఇది నా విన్నపం .

ఇక సినిమా లోకి వెళితే... మొదటి 5  నిముషాల్లో  సినిమాలో  లీనమైతే ఇంటర్వల్ దాక అసలు సినిమా ఎలా వెళ్లిందో కూడా తెలీకుండా సినిమాలో లీనం అయ్యేటట్లు  చేసాడు రాజమౌళి . ఒక ఈగ ను హీరో గా తీసుకుని దానిని కాసేపట్లో మన అభిమాన హీరో గా మార్చేశాడు . దానికి ముఖ కవళికలు లేవు . ఏడిస్తే మనం చూడటానికి అవ్వదు . అప్పుడు కీరవాణి తన ఇంద్రజాలం చేసాడు . ఈగతో పాటు మనమూ పగ లో పాలుపంచుకున్నాం . ఈగతో పాటు బాధ పడ్డాం . ఈగతో పటు సమంతాను ప్రేమించాం . ఈగతో పాటు దాని నిస్సహాయతను అనుభవించాం.. కొన్ని సార్లు గోళ్ళు కోరుక్కున్నాం . కొన్నిసార్లు కేరింతలు కొట్టాం . కీరవాణి కి వందనాలు .( మీరు కాపి కొట్టారో,, మీరే కొట్టారో  నేపధ్య సంగీతం బావుంది సార్ )

ఏమి లేని శూన్యంలో ఒక ఈగను ఊహించుకుని  సినిమా అంతా ఆ ఊహను నిజం లా మనకు భ్రమ కల్పిస్తూ నటించిన సుదీప్ కు వేయి నమస్కారాలు . స మంత  కోసం చెప్పాలంటే ఈ సినిమాలో ఎంత కావాలో అంతా నటించింది .  ఉత్తర కొరియాలో బొడ్డు చూపించుకుంటూ , అడవి మనుష్యుల గెటప్ లో పూనకపు డాన్సు లు లేనందుకు కధ  కు , పెట్టనందుకు రాజమౌళి కు  నా కృతజ్ఞతలు .

సాంకేతికంగా ఏదో సినిమా తో పోల్చనక్కరలేకుండా ఈ సినిమా కు కావలసిన సాంకేతిక నైపుణ్యం అందించిన కమల్ కన్నన్ & టీం అభినందనీయులు .

ఒక ఐడియా ను మోసి , దానిని దిగ్విజయంగా తెరమీద చూపించిన రాజమౌళి కి,, ఈ కధను నమ్మి నిర్మించిన నిర్మాతకు , తెర మీద  కొత్తగా   ఆవిష్కరించిన  సెంధిల్ కుమార్ కు , పెళ్ళాం , పిల్లలతో సినిమాకు వెళ్దామంటే భయమేస్తున్న ఈ రోజుల్లో ... ఫ్యామిలీ తో తెలుగు సినిమా కు వెళ్ళవచ్చు అని ధైర్యం ఇచ్చిన ఈ సినిమా టీం కు
అభివందనాలు .

రేటింగ్ లు , రివ్యూ లు , మేధావుల అభిప్రాయలు వినకుండా , ఒక మంచి చందమామ కధను ఒక సైంటిస్ట్ చెపితే ఎలా ఉంటుందో చూడాలని ఉంటె మీ ఫ్యామిలీ తో ఈ సినిమా కు వెళ్ళండి . అలా కాదు  మాకు వంశ చరిత్రలు , రక్తమోడుతున్న  కొడవళ్ళు కావాలంటే కొంచం ఓపిక పట్టండి .. వారస బాబులు త్వరలో మీ కోరిక తీరుస్తారు ...

సర్వేజన సుఖినోభవంతు ;

13, మే 2012, ఆదివారం


గబ్బర్ సింగ్ : నా రివ్యూ



తోలి పలుకు :
 భారత రాజ్యాంగము  19 ప్రకరణం ద్వారా, భారత పౌరుడిగా నాకు సంక్రమించిన భావ స్వాతంత్ర హక్కు ను , ఉపయోగించుకుని  నా అభిప్రాయాన్ని నా బ్లాగ్ లో రాసుకుంటు న్నందున  ఇది చదివిన చదువరికి  నా రివ్యూ నచ్చని పక్షంలో ... శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో  నన్ను తిట్టాలని అనిపిస్తే .. అదే రాజ్యాంగము ప్రసాదించిన హక్కుతో నన్ను తిట్టుకోవచ్చు ... నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ....

ఇక గబ్బర్ సింగ్ కోసం :
 వెంకట రత్నం నాయుడు  అలియాస్ గబ్బర్ సింగ్ అనే కుర్రవాడు తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటంతో , మారటి తండ్రిని అకారణంగా ద్వేషిస్తూ పెరిగి ఒక పోలీసు ఇన్స్పెక్టర్  అవుతాడు . మారటి తండ్రి కి, అతని కొడుకు అనగా గబ్బర్ సింగ్ తమ్ముడికి  ..గబార్ సింగ్ మీద మంచి అభిప్రాయం లేదు . కొండవీడు అనబడే ఊరిలో అక్రమాలు చేసే విలన్ అభిమన్యు సింగ్ ( సినిమాలో పేరు గుర్తు లేదు ) రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు . మొదటినుంచీ దూకుడు గా ఉండే గబ్బర్ సింగ్ , తన తిక్కతో  ఎన్నో లెక్కలు వేసి చివరకు అభిమన్యు సింగ్ ను మట్టి కరిపిచడమే కాకుండా , తన తండ్రి , తమ్ముడు ళ్ళతో కలిసి పోయి , భార్య , మామయ్య మరియు కుటుంబం తో సంతోషంగా ఎలా జీవించాడు అన్నదే  కధ.

దబాంగ్ అనే హిందీ చిత్రానికి తెలుగు కాపీ అన్న పేరు తప్ప సినిమా కి దబాంగ్ కి పోలికలు లేవు . మూల కధ ను మార్పుల పేరుతో ఖూనీ చేసేసాడు  డైరెక్టర్ . కాసేపు దబాంగ్ ను మర్చిపోయి తెలుగు సినిమా గా దీనిని  చూస్తే ....

పవనిజం అన్న పేరుతో మా బుర్రల్ని మట్టిబుర్రలుగా ఊహించుకున్న దర్శకుడి  దార్సనికతకు జోహార్లు . పోలీసు స్టేషన్ కు గబ్బర్ సింగ్ స్టేషన్ అని పేరు పెట్టడం కానివ్వండి , గబ్బర్ సింగ్ గారు అస్తమానం అతని చాతీని , వేసుకున్న బనియన్ ను చూపించటం కానీయండి , పోలీసు స్టేషన్ ను డ్రామా కంపనీ లా చూపించటం , పోలిసులనందరిని  బపూన్ గాళ్ళ లా చూపించటం కానీయండి  దర్శకుడు తెలుగు ప్రేక్షకులను ఎర్రి పప్పలుగా ఊహించుకుని సినిమా ను తెరకెక్కించిన విధానానికి జోహార్లు ...

అసలు ఎలాంటి విరోధం లేకుండా , మొట్టమొదటి సీన్ లోనే విలన్ కు వ్యతిరేకంగా ఆవేశంగా డైలాగులు చెప్పి ఎందుకు హీరో గారు కోరి ముడ్డి లో కోడి ఈకను పెట్టి గెలుక్కున్నారో నాకు అర్ధం కాలేదు . విలన్ వచ్చింది  అభినందన తెలుపటానికి . అంతకు మించి సీన్ లో వాడు ఏమి పాపం చెయ్యలేదు .

సినిమా మొత్తం విలన్ అలా వాళ్ళు తోమించుకునీ , స్నానం చేస్తూ , అరుస్తూ , ఆవేశ పడుతూనే ఉన్నాడు . ఒక్క కారణం లేదు .. విలన్ దగ్గర ఉంటె రౌడీలందరూ  మళ్ళీ    బఫూన్ లే .

తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉందా అంటే అదీ లేదు . సుహాసిని ఎందుకుందో కూడా తెలీకుండా వచ్చి వెళ్ళిపోయింది .
శ్రుతి హసన్ కోసం ఎం చెప్పాలో కూడా తెలియటం లేదు . పక్కనే వాంప్ కారెక్టర్ చేసిన  గాయత్రీ రావు  కారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాన్రా భగవంతుడా అని జీవితాంతం బాధపడుతుందని నా అభిప్రాయం . కోట శ్రీనివాస రావు ఉన్న రెండు సీన్లు అతని టాలెంట్ చూపించాడు .

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ .., కుడి చేత్తో మెడ మీద గోక్కునే సీన్  ఇందులో కూడా రిపీట్ చేసాడు . రాబోయే సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వస్తున్న ఏసు క్రీస్తు సినిమాలో కూడా  ఇలాగె అతను మెడ మీద గోక్కుంటే .. ఎలాంటి కారెక్టర్ అయిన గోక్కునే సీన్ కామన్ అని ఫిక్స్ అయిపోవచ్చు .

సినిమా ఇండస్ట్రీ హిట్ అని కొందరు , రికార్డు లు బద్దలు కొట్టి భజంత్రీలు మో గిస్తుందని  కొందరు , ఇటువంటి సినిమా ఇక రాదు అని కొందరు , మెగా వంస ప్రతిష్ట అని కొందరు చెప్పోకోగా విన్నాను . సో నా బుద్ధి సరిగ్గా పనిచెయ్యటం లేదని నాకు అర్ధమైంది . కాని పని చేస్తున్న బుద్ధి తో ఒకటి మాత్రం చెప్పగలను . దబాంగ్ అంటే మొండివాడు అని అర్ధం చేసుకోకుండా తిక్కలోడు , పిచ్చి వాడు అని హరీష్ శంకర్ అర్ధం చేసుకుని ... తెలుగు ప్రేక్షకులు పిచ్చివారు అని ప్రఘాడంగా నమ్మి సినిమా ను తీసారు .

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం , దర్శకుడి టేకింగ్  చాల బావున్నాయి . ఆకాశం అమ్మయయితే నీ లా ఉంటుందే పాత ఆహ్లాదకరంగా ఉంది . నడుం దగ్గర బెల్ట్ బకిల్ పట్టుకుని ముందుకూ వెనక్కూ ఊపుతూ ఉండే పా ................................... స్టెప్ ను అన్ని పాటల్లో పవన్ గారు వాడారు .

నాకు మొత్తం సినిమాలో  పోలీసు స్టేషన్ లో అంతాక్షరి  సీన్  ఒక్కటే నేను పెట్టిన డబ్బులకు కొంచం కిట్టుబాటు అయింది అనిపించింది . అది కూడా ఒక టీవీ షో చూసినట్లు చూసానే తప్ప సినిమాలో దాని అవసరం అసలు లేదు .

తుది పలుకు :
 పైన చెప్పిన వన్నీ నాకు అనిపించినవి . బయట టాక్ వేరేలా ఉంది. అభిమానులు పండగ చేసుకుంటున్నారు . ఆడవాళ్ళంతా  ఇంట్లో వంట చేసుకుంటున్నారు . వందమందికి నచ్చిన సినిమా నా లాంటి ఒక గొట్టం గోపాలకృష్ణ కు నచ్చక పోతే కళామతల్లికి వచ్చే నష్టం ఏమి లేదు .... మా తాతయ్య ఒక సామెత చెప్పేవారు .... " లంగడి గుద్ద తో తిరిగే ఊరిలో గోచీ కట్టుకుంటే విలువుండదు " అని . మీకు అర్ధమైతే ఓకే . అర్ధం కాకపోతే క్షమించండి .

ఎవరినీ బాధ పెట్టె ఉద్దేశ్యం కాని , ఎవరిని కించపరచాలని కాని  నేను ఇది రాయలేదు . ఇది నా అభిప్రాయము మాత్రమె ..

సర్వేజనా సుఖినోభవంతు ....

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

దమ్ము - ( My  take )

 " ఏంటిరా నువ్వు చేసిన పని ? 
" జనం క్షేమం కోసం ఒకడిని చంపాను "
" అయితే  ఈ రోజు నుంచి మన రెండు వంశాల మధ్య  ఎటువంటి సంబంధాలు ఉండకూడదు . ఒకరిని ఒకరు చంపుకోవటమే . ఈ పోరాటంలో ఓటమి ఎవరిదో , గెలుపెవరిదో తేల్చుకుందాం ".

ఆ సంఘటనతో ఆ రెండు వంశాల మధ్య 45 ఏళ్ళు  పోరాటం జరిగింది . నిరంతరం ఆ ఊరిలో యుద్ధం జరుగుతూ  కాష్టం రగులుతూనే ఉంది . ఒక రోజు ఆ రెండు వంశాల శ్రేయస్సును కోరుకునే  ఒక పెద్దమనిషి ఒక  రాజీ  ప్రయత్నం చేసాడు . దాని ప్రకారం ఇక రోజూ చంపుకోవటం ఆపేసి  సంక్రాంతి సమయంలో ఒక రెండురోజులు ఒకరిని ఒకరు చంపుకోవచ్చు . అందులో ఓడిన వారు గెలిచిన వారికి దాసోహం . దానికోసం ఆ పోరాటానికి ముందు ఒకరికి ఒకరు తాబూలం ఇచ్చి  చంపుకోవ టానికి  అగ్రీమెంట్ చేసుకుంటారు . అలా తాంబూలం మార్చుకోవటం మొదలుపెట్టి సినిమా చివరి వరకూ తాంబూలాలు మార్చు కుంటూనే  ఉన్నారు .సో ఈ సినిమా కు బోయపాటి శ్రీను గారు  " దమ్ము " అని పెట్టకుండా  " తాంబూలం " అని పెట్టి ఉంటె బావుండేది అని నా ప్రగాడమైన నమ్మకం .

ఇక పేర్లు పడిన తరువాత .. ఎవడో రౌడీ  ఇంకెవడో బిజినెస్ మాన్ ను బెదిరించి చంపాలనుకుంటూ ఉంటె , మన NTR  గారు ఒక పెద్ద బిల్డింగ్ 5 వ అంతస్తు నుంచి  సునాయాసంగా ఒక కార్ మీదకు దూకి , వచ్చిన 20 మంది ని  ఈక బరాబర్ అన్నట్లు చితగ్గోట్టేస్తారు . షరా మామూలుగా హీరో గారు అనాధ . అతనికి ఫ్రెండ్ అలీ గారు . అక్కడనుంచి హీరో గారు త్రిష గారిని చూసి మొదటి చూపులోనే ప్రేమించేస్తారు . కట్ చేస్తే పాట. మళ్ళి రబ్బరు బాండ్ ను సాగదీసి వదిలినట్లు  కంపోస్ చెయ్యబడిన స్టెప్పులతో పాట ను ముగించగానే , కోట శ్రీనివాస రావు గారు  హీరో గారిని దత్తత తీసుకుంటారు . హీరో గారు ముందు చెప్పబడిన వంశపు ఆచారమైన తాంబూలం తీసుకోవటానికి  వెళ్ళిపోతారు .  ఇంటర్వల్ లోగా  ఒక 2764 మంది కాళ్ళు చేతులు విరగ్గోట్టేస్తారు . అక్కడ హీరో గారికి మరదలు వరసలో రెండో హీరోయిన్ వచ్చేస్తుంది . త్రిష గారు కూడా అక్కడకు వచ్చేస్తారు . బోయపాటి గారు  స్క్రీన్ప్లే అలా నడిపించారు . మీ ఊహ కరెక్టే ..ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ లు  హీరో గారి కోసం తాపత్రయ పడిపోతున్నారు . వెంటనే  మళ్ళి రబ్బర్ బాండ్, పోలియో రీ మిక్స్ తో ఒక  అదరగొట్టే పాట . విలనేమో ఎంత సేపు తాంబూలం తీసుకోవాలని తాపత్రయం తప్ప ఇంకో ఆలోచన లేకుండా గడిపేస్తున్నాడు . ఈ లోగా ఇంటర్వల్ అయింది . 
టీ తాగి , 70 రూపాయలు వదిలించుకుని ఒక పాప్ కార్న్ కొనుక్కుని మళ్ళీ సినిమాలో లీనమయ్యాను . ఇక చూస్కోండి . వంశాల కోసం మనకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హీరో గారు.  ఈ మధ్యలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది . బోయపాటి గారు "అడవిలో అందగత్తెలు " సినిమా ను చాల సార్లు చూసి ఇన్ స్పయిర్  అయినట్లున్నారు . అందుకే సినిమా లో ప్రతీ సీన్ లో  ఆఖరకు ఎంత ఎమోషనల్ సీన్ అయిన సరే హీరోయిన్ ల బొడ్డును , తొడలను చూపించకుండా ఒక్క సీన్ కూడా తీయలేదు . బోనస్ గా " బయటకు తియ్యి కడుగుతా " , " నన్ను యూస్ చేసుకో "," నన్ను వాడుకో " లాంటి ఆధ్యాత్మిక  సంభాషణలు పవిత్రంగా హీరొయిన్ ల చేత పలికించారు . మళ్ళీ మన కంటికి విందు నివ్వాలనే ఉద్దేశ్యంతో  చివరి పాట  ఇద్దరు హీరోయిన్ లు, ఇద్దర్ ఐటెం భామలను పెట్టి మొత్తం నలుగురితో  కలిపి ఒక మసాల పాట ను కూడా పెట్టి  మన జన్మను ధన్యం చేసారు . చివరికి బోలెడు పోరాటం తరువాత ,ఎంతో మందిని చంపి  విలన్  మనసు మార్పించి తన దమ్ము ను చూపించి సినిమాను ముగించి మన కళ్ళు తెరిపించారు హీరో గారు . 

ఇక కీరవాణి గారు అప్పుడెప్పుడో తేజ గారు తీసిన జయం సినిమాలో ని వీరి వీరి గుమ్మడిపండు ..వీరి పేరేమి  అనే పాట ను  యదేచ్చగా స్వంతం చేసుకుని  ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు గా వాడుకున్నారు .  మీరు వర్ధిల్లాలి . ఇక కామెర కోసం చెప్పక్కర్లేదు . ఇలాంటి సినిమాలకు ఇలా ఉండాలి అన్న ఫార్ములా ను పాటించారు  కెమెరా మాన్ గారు .  

మొత్తంగా చెప్పాలంటే  దాదాపు 30 డ్రమ్ముల రక్తం , 7 వేల మందిదాకా నరుక్కోవటం , మంచి మంచి బొడ్డు క్లోజప్ లు, అర పేజీ కు తగ్గకుండా వంశాల కోసం డైలాగులు (బోలెడు సార్లు ) , ద్వందార్ధాల డైలాగులు , బాంబులు , కత్తులు , గాల్లో ఎగిరే సుమో లు , వేల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లు , పువ్వులు , నగలు , భారీ ఫైట్లు , ఐటెం సాంగులు  అనీ కలిపి మిక్సీ లో వేసి రుబ్బి ఈ చిత్ర రాజాన్ని మనమీదకు వదిలిన బోయపాటి వారికి , నటించి మన హృదయాలను కదిలించిన NTR గారికి  శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .

నాకు అనిపించింది రాసాను . చూస్తే మీ ఇష్టం . చూడకపోయినా మీ ఇష్టం . 

సెలవు ...