8, జులై 2012, ఆదివారం


 ఈగ    రివ్యూ

చాలా రోజులుగా  ఊరిస్తూ , విడుదలకు ముందే కధను చెప్పిన రాజమౌళి  ఈ సినిమా తో చాలా దూరం వెళ్లి పోయాడు . ఈ సినిమా ద్వారా రాజమౌళి ఎం చెప్పాలనుకున్నారో నాకు తెలీదు కాని నాకు రెండు విషయాలను స్పష్టంగా  అతను చెప్పినట్లు అనిపించింది .
1 . వంశాలు,, ఆయుధాలు,, ఫాక్షన్ , \వంకర , \టింకర పోలియో డాన్సులు , ఐటెం సాంగ్  మాత్రమె  కమర్షియల్ సినిమా కాదు అన్నది .
2 . మనసులో సంకల్పం బలంగా ఉంటె ఈగతో కూడా సినిమా తీస్తాను , మీ తొక్కలో హీరోలు కూడా నాకు అక్కరలేదు అన్నది .( రోలింగ్ టైటిల్స్ లో ఈగ తో కొన్ని పాపులర్ సినిమా పాటల స్టెప్పులు వేయించాడు )

ఈ సినిమా కోసం విమర్శించే వాళ్లకు ఒక సామెత ఎలానూ ఉంది " పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు " అన్నది . హాలీవుడ్ లో గబ్బిలాన్ని , సాలేపురుగుని హీరో లుగా చూపించినప్పుడు  జబ్బలు చరుచుకుని కాఫీ డే లో కూర్చుని  ఆయా  సినిమాలను పొగిడే మేధావులారా , ఈ సినిమా కు  ఉన్న పరిమిత మార్కెట్ ను , వనరులను దృష్టిలో   పెట్టుకుని చూడండి . ఇది నా విన్నపం .

ఇక సినిమా లోకి వెళితే... మొదటి 5  నిముషాల్లో  సినిమాలో  లీనమైతే ఇంటర్వల్ దాక అసలు సినిమా ఎలా వెళ్లిందో కూడా తెలీకుండా సినిమాలో లీనం అయ్యేటట్లు  చేసాడు రాజమౌళి . ఒక ఈగ ను హీరో గా తీసుకుని దానిని కాసేపట్లో మన అభిమాన హీరో గా మార్చేశాడు . దానికి ముఖ కవళికలు లేవు . ఏడిస్తే మనం చూడటానికి అవ్వదు . అప్పుడు కీరవాణి తన ఇంద్రజాలం చేసాడు . ఈగతో పాటు మనమూ పగ లో పాలుపంచుకున్నాం . ఈగతో పాటు బాధ పడ్డాం . ఈగతో పటు సమంతాను ప్రేమించాం . ఈగతో పాటు దాని నిస్సహాయతను అనుభవించాం.. కొన్ని సార్లు గోళ్ళు కోరుక్కున్నాం . కొన్నిసార్లు కేరింతలు కొట్టాం . కీరవాణి కి వందనాలు .( మీరు కాపి కొట్టారో,, మీరే కొట్టారో  నేపధ్య సంగీతం బావుంది సార్ )

ఏమి లేని శూన్యంలో ఒక ఈగను ఊహించుకుని  సినిమా అంతా ఆ ఊహను నిజం లా మనకు భ్రమ కల్పిస్తూ నటించిన సుదీప్ కు వేయి నమస్కారాలు . స మంత  కోసం చెప్పాలంటే ఈ సినిమాలో ఎంత కావాలో అంతా నటించింది .  ఉత్తర కొరియాలో బొడ్డు చూపించుకుంటూ , అడవి మనుష్యుల గెటప్ లో పూనకపు డాన్సు లు లేనందుకు కధ  కు , పెట్టనందుకు రాజమౌళి కు  నా కృతజ్ఞతలు .

సాంకేతికంగా ఏదో సినిమా తో పోల్చనక్కరలేకుండా ఈ సినిమా కు కావలసిన సాంకేతిక నైపుణ్యం అందించిన కమల్ కన్నన్ & టీం అభినందనీయులు .

ఒక ఐడియా ను మోసి , దానిని దిగ్విజయంగా తెరమీద చూపించిన రాజమౌళి కి,, ఈ కధను నమ్మి నిర్మించిన నిర్మాతకు , తెర మీద  కొత్తగా   ఆవిష్కరించిన  సెంధిల్ కుమార్ కు , పెళ్ళాం , పిల్లలతో సినిమాకు వెళ్దామంటే భయమేస్తున్న ఈ రోజుల్లో ... ఫ్యామిలీ తో తెలుగు సినిమా కు వెళ్ళవచ్చు అని ధైర్యం ఇచ్చిన ఈ సినిమా టీం కు
అభివందనాలు .

రేటింగ్ లు , రివ్యూ లు , మేధావుల అభిప్రాయలు వినకుండా , ఒక మంచి చందమామ కధను ఒక సైంటిస్ట్ చెపితే ఎలా ఉంటుందో చూడాలని ఉంటె మీ ఫ్యామిలీ తో ఈ సినిమా కు వెళ్ళండి . అలా కాదు  మాకు వంశ చరిత్రలు , రక్తమోడుతున్న  కొడవళ్ళు కావాలంటే కొంచం ఓపిక పట్టండి .. వారస బాబులు త్వరలో మీ కోరిక తీరుస్తారు ...

సర్వేజన సుఖినోభవంతు ;

కామెంట్‌లు లేవు: