27, ఏప్రిల్ 2012, శుక్రవారం

దమ్ము - ( My  take )

 " ఏంటిరా నువ్వు చేసిన పని ? 
" జనం క్షేమం కోసం ఒకడిని చంపాను "
" అయితే  ఈ రోజు నుంచి మన రెండు వంశాల మధ్య  ఎటువంటి సంబంధాలు ఉండకూడదు . ఒకరిని ఒకరు చంపుకోవటమే . ఈ పోరాటంలో ఓటమి ఎవరిదో , గెలుపెవరిదో తేల్చుకుందాం ".

ఆ సంఘటనతో ఆ రెండు వంశాల మధ్య 45 ఏళ్ళు  పోరాటం జరిగింది . నిరంతరం ఆ ఊరిలో యుద్ధం జరుగుతూ  కాష్టం రగులుతూనే ఉంది . ఒక రోజు ఆ రెండు వంశాల శ్రేయస్సును కోరుకునే  ఒక పెద్దమనిషి ఒక  రాజీ  ప్రయత్నం చేసాడు . దాని ప్రకారం ఇక రోజూ చంపుకోవటం ఆపేసి  సంక్రాంతి సమయంలో ఒక రెండురోజులు ఒకరిని ఒకరు చంపుకోవచ్చు . అందులో ఓడిన వారు గెలిచిన వారికి దాసోహం . దానికోసం ఆ పోరాటానికి ముందు ఒకరికి ఒకరు తాబూలం ఇచ్చి  చంపుకోవ టానికి  అగ్రీమెంట్ చేసుకుంటారు . అలా తాంబూలం మార్చుకోవటం మొదలుపెట్టి సినిమా చివరి వరకూ తాంబూలాలు మార్చు కుంటూనే  ఉన్నారు .సో ఈ సినిమా కు బోయపాటి శ్రీను గారు  " దమ్ము " అని పెట్టకుండా  " తాంబూలం " అని పెట్టి ఉంటె బావుండేది అని నా ప్రగాడమైన నమ్మకం .

ఇక పేర్లు పడిన తరువాత .. ఎవడో రౌడీ  ఇంకెవడో బిజినెస్ మాన్ ను బెదిరించి చంపాలనుకుంటూ ఉంటె , మన NTR  గారు ఒక పెద్ద బిల్డింగ్ 5 వ అంతస్తు నుంచి  సునాయాసంగా ఒక కార్ మీదకు దూకి , వచ్చిన 20 మంది ని  ఈక బరాబర్ అన్నట్లు చితగ్గోట్టేస్తారు . షరా మామూలుగా హీరో గారు అనాధ . అతనికి ఫ్రెండ్ అలీ గారు . అక్కడనుంచి హీరో గారు త్రిష గారిని చూసి మొదటి చూపులోనే ప్రేమించేస్తారు . కట్ చేస్తే పాట. మళ్ళి రబ్బరు బాండ్ ను సాగదీసి వదిలినట్లు  కంపోస్ చెయ్యబడిన స్టెప్పులతో పాట ను ముగించగానే , కోట శ్రీనివాస రావు గారు  హీరో గారిని దత్తత తీసుకుంటారు . హీరో గారు ముందు చెప్పబడిన వంశపు ఆచారమైన తాంబూలం తీసుకోవటానికి  వెళ్ళిపోతారు .  ఇంటర్వల్ లోగా  ఒక 2764 మంది కాళ్ళు చేతులు విరగ్గోట్టేస్తారు . అక్కడ హీరో గారికి మరదలు వరసలో రెండో హీరోయిన్ వచ్చేస్తుంది . త్రిష గారు కూడా అక్కడకు వచ్చేస్తారు . బోయపాటి గారు  స్క్రీన్ప్లే అలా నడిపించారు . మీ ఊహ కరెక్టే ..ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ లు  హీరో గారి కోసం తాపత్రయ పడిపోతున్నారు . వెంటనే  మళ్ళి రబ్బర్ బాండ్, పోలియో రీ మిక్స్ తో ఒక  అదరగొట్టే పాట . విలనేమో ఎంత సేపు తాంబూలం తీసుకోవాలని తాపత్రయం తప్ప ఇంకో ఆలోచన లేకుండా గడిపేస్తున్నాడు . ఈ లోగా ఇంటర్వల్ అయింది . 
టీ తాగి , 70 రూపాయలు వదిలించుకుని ఒక పాప్ కార్న్ కొనుక్కుని మళ్ళీ సినిమాలో లీనమయ్యాను . ఇక చూస్కోండి . వంశాల కోసం మనకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హీరో గారు.  ఈ మధ్యలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది . బోయపాటి గారు "అడవిలో అందగత్తెలు " సినిమా ను చాల సార్లు చూసి ఇన్ స్పయిర్  అయినట్లున్నారు . అందుకే సినిమా లో ప్రతీ సీన్ లో  ఆఖరకు ఎంత ఎమోషనల్ సీన్ అయిన సరే హీరోయిన్ ల బొడ్డును , తొడలను చూపించకుండా ఒక్క సీన్ కూడా తీయలేదు . బోనస్ గా " బయటకు తియ్యి కడుగుతా " , " నన్ను యూస్ చేసుకో "," నన్ను వాడుకో " లాంటి ఆధ్యాత్మిక  సంభాషణలు పవిత్రంగా హీరొయిన్ ల చేత పలికించారు . మళ్ళీ మన కంటికి విందు నివ్వాలనే ఉద్దేశ్యంతో  చివరి పాట  ఇద్దరు హీరోయిన్ లు, ఇద్దర్ ఐటెం భామలను పెట్టి మొత్తం నలుగురితో  కలిపి ఒక మసాల పాట ను కూడా పెట్టి  మన జన్మను ధన్యం చేసారు . చివరికి బోలెడు పోరాటం తరువాత ,ఎంతో మందిని చంపి  విలన్  మనసు మార్పించి తన దమ్ము ను చూపించి సినిమాను ముగించి మన కళ్ళు తెరిపించారు హీరో గారు . 

ఇక కీరవాణి గారు అప్పుడెప్పుడో తేజ గారు తీసిన జయం సినిమాలో ని వీరి వీరి గుమ్మడిపండు ..వీరి పేరేమి  అనే పాట ను  యదేచ్చగా స్వంతం చేసుకుని  ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు గా వాడుకున్నారు .  మీరు వర్ధిల్లాలి . ఇక కామెర కోసం చెప్పక్కర్లేదు . ఇలాంటి సినిమాలకు ఇలా ఉండాలి అన్న ఫార్ములా ను పాటించారు  కెమెరా మాన్ గారు .  

మొత్తంగా చెప్పాలంటే  దాదాపు 30 డ్రమ్ముల రక్తం , 7 వేల మందిదాకా నరుక్కోవటం , మంచి మంచి బొడ్డు క్లోజప్ లు, అర పేజీ కు తగ్గకుండా వంశాల కోసం డైలాగులు (బోలెడు సార్లు ) , ద్వందార్ధాల డైలాగులు , బాంబులు , కత్తులు , గాల్లో ఎగిరే సుమో లు , వేల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లు , పువ్వులు , నగలు , భారీ ఫైట్లు , ఐటెం సాంగులు  అనీ కలిపి మిక్సీ లో వేసి రుబ్బి ఈ చిత్ర రాజాన్ని మనమీదకు వదిలిన బోయపాటి వారికి , నటించి మన హృదయాలను కదిలించిన NTR గారికి  శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .

నాకు అనిపించింది రాసాను . చూస్తే మీ ఇష్టం . చూడకపోయినా మీ ఇష్టం . 

సెలవు ...

 





 














 

11, ఏప్రిల్ 2012, బుధవారం



 
One  - షార్ట్ ఫిలిం రివ్యూ

షార్ట్ మూవీస్ కోసం  రివ్యూలు రాయవచ్చా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే  , చిత్త శుద్ధితో  సినిమా మీద  ఉన్న ప్రేమ తో , ఖాళీ లేని బిజీ రోజుల్లో ఎంతో ఓర్పుతో  సినిమా ను తీసిన   టీము కు హృదయ పూర్వకమైన  వందనాలు . టాటా సుమో లు గాల్లో పేలిపోవటాలు, వంశాల కోసం  సెల్ఫ్ డబ్బాలు , కోట్ల బడ్జెట్ తో తీసి చివరకు నాలుగు రోజులకే డిస్ట్రి బ్యుటర్లను ముష్టి వాళ్ళు గా మార్చే  పెద్ద సినిమాల కన్నా సినిమా ఎన్నో రకాలుగా మేలు
లోట్లు వెతకాలంటే  వెయ్యి ఉండొచ్చు . రంద్రాన్వేషణ మానేసి ప్రయత్నాన్ని అభినందిస్తే  మంచి సినిమాలు తీయాలనే ఒక తపను ప్రోత్సహించే వాళ్ళలో మనమూ ఒకరం అవుతాం .

సినిమా కధను నేను ఇక్కడ ప్రస్తావించ దలచుకోలేదు . దయచేసి youtube లో 5 భాగాలను చూడండి .
link :  http://youtu.be/0laHGh8JW2o .  
మంచి ఆడియో సిస్టం పెట్టుకుని చూస్తే  మీకు మంచి సినిమా చూసిన ఫీలింగ్  గారంటీ . మనం స్టార్ హోటల్ కు వెళ్ళబోయి ఏదో కారణంతో పక్కనే ఉన్న కాకా హోటల్ కు వెళ్ళితే , అక్కడ స్టార్ హోటల్ కన్నా మంచి భోజనం ( రుచి కరమైన ) దొరుకుతుంది . అనుకోకుండా ఇలాంటి సినిమాలు చూస్తే ( షార్ట్ ఫిలిం అయినా సినిమాలకు ఎక్కడా తీసిపోలేదు ) అలాంటి ఫీలింగ్ కలుగుతుంది .

ఇందులో ముఖ్యముగా ప్రశంసించవలసిన వలసిన వ్యక్తులు నలుగురు . ఒకరు  కామెర మాన్ విక్టర్ . రెండవది మ్యూజిక్ ఇచిన శ్రవణ్. మూడవది  క్రాంతి కుమార్ - చాలా చక్కగా డైరెక్షన్  చేసారు . మంచి ఎతుగడ ఉన్న కధను ఎన్నుకోవటం ఒక ఎత్తు , పరిమితమైన వనరులతో  దానిని తెరకు ఎక్కించటం ఇంకో ఎత్తు . ఇక నాల్గవది  రఘు . ఒక్క డైలాగ్ మాడ్యులేషన్  తప్ప నటనా పరంగా చాలా చక్కటి ప్రతిభ చూపించాడు . చాల నాచురల్ గా ఇతనికి సీన్లు సరిపోయినట్లు  అనిపించింది . స్నేహితులిగా చేసిన వారిలో  ఎవరినీ పాయింట్ అవుట్ చెయ్యలేము . పాత్రల పరిధి మేరకు  చాలా చక్కగా నటించారు . ముఖ్యముగా పార్ట్ 4 లో వచ్చే చేతబడి సీన్ లో  రఘు నటన అధ్బుతం .

విక్టర్ కేమెర  చాలా  ఆహ్లాదంగా ఉంది . కంటికి ఇంపుగా ఫ్రేం  సెట్ చెయ్యటం  దర్శకుడి  సృజనాత్మకతకు అద్దం పడుతోంది . శ్రవణ్ అందించిన సంగీతం  , ఒక పాట  సరిగ్గా అతికినట్లు సరిపోయాయి .   వనరులు పరిమితంగా ఉండటం వలన  కాలేజ్ కాంపస్ ను  పూర్తి , విద్యార్ధులతో నిండుగా చూపించలేకపోయారు . హీరోయిన్  చాలా ఫ్రెష్ గా , అందముగా ఉంది . చక్కగా నటించింది కూడా . అసందర్భముగా ప్రవేశించి  తరువాత కనిపించకుండా పోవటమే కాక  కధలో తన పాత్ర పరిమితం . అసలు అవసరం లేదు కూడా అని నా అభిప్రాయముమరీ సీరియస్ గా ఉండకుండా  కొంచం రిలాక్స్  గా ఉండటం కోసం దర్శకుడు హీరోయిన్ ను జోప్పించాడని నా అభిప్రాయము .

చాలా  స్వల్ప వనరులతో తీసిన సినిమాలో లోటు పాతులను వెతకటం మూర్ఖత్వం అని తెలిసినప్పటికీ , మంచి ప్రయత్నంలో  చిన్న పొరపాట్లను ఎత్తి చూపిస్తే  రాబోయే  ప్రయత్నాలలో వాటిని సరిచేసుకుంటా రన్న ఆశతో చెప్పటం జరిగింది .

ఒకటి మాత్రం నిజంబాబులు , దత్తులు , కత్తులు , బిల్డ్ అప్ లు , బొడ్లు, తొడల తో నిండి ఉన్న  తెలుగు చిత్ర సీమలో ఎవరైనా అభిరుచి ఉన్న నిర్మాత  టీం కు ఒక్క అవకాశమిస్తే  .. మన తెలుగు ప్రేక్షకులకు వీళ్ళు ఒక మంచి సినిమా ను అందిస్తారనే నమ్మకం నాకుంది ... సినిమా చూసి మీకనిపిస్తే  ఇంకొక పది మందికి చెప్పండి . కొత్త వాళ్ళ ప్రతిభను  ప్రోత్సహిస్తే మనకు  చివరకు మిగిలేది   మంచి  తెలుగు సినిమా కాబట్టి  ప్రయత్నాన్ని  మరొక్కసారి మనస్పూర్తిగా అభినందిస్తూ , రఘు కు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ ..సెలవు







9, ఏప్రిల్ 2012, సోమవారం

రచ్చ 

 

 

 

 

 

 

 హెచ్చరిక : మీరు  గుండె జబ్బులు  ఉన్నవారైతే , మీకు నరాల బలహీనత ఉన్నట్లయితే , మీరు గర్భంతో ఉన్నా  మీరు   బలహీన మనస్కులైనా , ఈ సినిమా చూడవద్దు .  

అభ్యర్ధన :  మీరు  మెగా ఫ్యామిలీ ను , వారి వంశాన్ని ( దీనెమ్మ జీవితం .. ఇది నా మనసులో అనుకుంటున్నాను అని మీరు అర్ధం చెసుకొనగలరు )  ప్రేమించే , అభిమానించే  వారైతే  దయచేసి ఈ రివ్యూ చదివి నన్ను               బూతులు తిట్టడం కాని , పరువు నష్టం దావా వెయ్యటం కాని చెయ్యవద్దని  నా ప్రార్ధన .

సంపత్ నంది  డైరెక్టర్ గా తీసిన  ఈ చిత్ర రాజము , ఒక కలికితు రాయి . ఆడియో ఫంక్షన్ చూసి ఇదేదో  యాక్షన్  సినిమా అని వెళ్తే ..ఆశ్చర్య కరముగా   ఇది  కొన్ని పాత సినిమాలు కలిపి తీసిన కలగూర గంప కధను కలిగిఉన్న  ఒక భయానక చిత్రము . ( హార్రర్ మూవీ ).

ఇక కధ ను అవలోకించి నట్లైన చో : రాం చరణ్ తేజ అనబడు ఒక  బస్తీ కుర్రవాడు , తన పేదరికము వలన  ఎల్లప్పుడూ  pepe jeans , Lee , UCB  బట్టలు వేసుకుంటూ , మంచి మంచి విదేశీ బైకుల పైన తిరుగుతూ , వాళ్ళ పెంపుడు తల్లి తండ్రితో , ఒక విశాలమైన  cane furniture గల ఒక బీద ఇంట్లో నివసిస్తూ ఉంటాడు . ఇతను  మొత్తం సిటీ లో జరిగే  ఎలాంటి పందెము నైనను జయించగల సమర్ధుడు . 10 ,000 కోట్ల ఆస్తికి వారసురాలైన  తమన్నా గారిని ఈయన గారు ప్రేమించి , వలలో పడేస్తే 20 లక్షల బెట్టింగ్ డబ్బులు వస్తాయి . దానితో తన పెంపుడు తండ్రి  ఆరోగ్యాన్ని బాగుచేయించి చరిత్ర పుటలో స్థానం సంపాదించాలని అనుకుంటాడు . నాకు అర్ధం కానిదేమిటంటే  నిజంగా ప్రేమించి  అలాంటి పిల్లను పడేస్తే  ముష్టి 20 లక్షలు ఎందుకు  దర్జాగా 10000 కోట్లు ఇతనివే అవుతాయి కదా ... మరి  శ్రీ సంపత్ నంది గారు గాని, శ్రీ చిరంజీవి గారు గాని కధా చర్చలలో ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు ? అలాగే శ్రీ సంపత్ నంది గారు .. బస్తీ కుర్రవాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీరు కొంచం మీ దగ్గరలో ఉన్న బస్తీలకు వెళ్ళండి సార్ .. ఇంత  ఖరీదైన బస్తీ కుర్రవాళ్లను మేము తట్టుకోలేకపోతున్నాము .

సదరు తమన్నా గారు కూడా పెంపుడు కూతురు . ఆమె ఆస్తి ని కొట్టేయ్యాలని ముకేష్ రుషి గారు జాగ్రతగా ఆమెను 18  ఏళ్ళు కాపాడితే మన హీరో గారు ఆమెను వీజీగా  లైన్ లో పడేసి  20 లక్షలు పట్టుకెళ్ళి పోదామని  మంచి క్యారీ బాగ్ ను రెడీ చేసుకుంటారు . ఈలోగా హీరోయిన్ గారు , ఇదంతా తూచ్ ... నేనే కావాలని నీ ప్రేమలో పడిపోయాను అని చెప్తారు . తరువాత చూస్తే హీరో కు హీరోయిన్ కు  ఒకరే అన్యాయం చేసారన్న నిజం తెలుస్తుంది . ఇక హీరో గారు  అందరిని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు . అదే ఈ చిత్ర రాజము యొక్క  చారిత్రాత్మకమైన కధ.

మొత్తం సినిమా అంతా  పాత చిరంజీవి సినిమాలు అంటే 80 , 90 లలో వచ్చినవి చూసినట్లే ఉంది . అయ్యా పరుచూరి బ్రదర్సూ , ఇంకా డబుల్ మీనింగ్  సంభాషణలు , హీరో విలన్లు  ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకోవటం , వంశాల కోసం , ఫ్యామిలీ ల కోసం , వాళ్ళు మమ్మల్ని ఉద్దరించిన విషయాల కోసం మీరు రాయటం ఆపేసి  దయచేసి  ఏదైనా  పార్టీ లో జాయిన్ అయిపోండి సార్... ఈ హింస భరించ లేకపోతున్నాం . సినిమా లో పాటలు ఎందుకు వస్తున్నాయో ఎవడికి అర్ధం కావటం లేదు .  సినిమా మొత్తం రామ్ చరణ్ గారు మెడలో వేసుకున్న ఆంజనేయుడి  లాకెట్  తమన్నా గారికి కనపడదు ..  అవసరమైనప్పుడే అది కనిపిస్తుంది ...  

ఇక హీరో గారు అందంగా ఉన్నారని సినిమా లో ఉన్న అన్ని పాత్రలతో  చెప్పించి, అది చాలదన్నట్లు ఆడియో ఫంక్షన్ లలో, టీవీ  ప్రోమో లలో కూడా చెప్పించారు . ఇదంతా అతను అందముగా ఉన్నారని మనల్ని ఒప్పుకోమని మెంటల్ గా ట్యూన్ చేస్తున్నట్లా? లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లా ? అయ్యా ? తెలుగు ప్రేక్షకులు  బాగా విశాల హృదయులు . ఎలాంటి వారైన  వారసులు అయితే ఒప్పుకుంటారు ... మా తల రాత అలా ఉన్నప్పుడు మీరు కష్టపడటం దేనికి ? మేము ఒప్పుకున్తున్నాం ..రామ్ చరణ్ గారు చాల అందముగా ఉన్నారు .

ఇక చివరిగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లు తిరగ రాసిందనీ , అత్యదిక వసూళ్లు చేసిందనీ , సూపర్ డూపర్ హిట్ అనీ టీవీ లలో చెప్తుంటీ చూసాను . . ఇలాంటి చిత్ర విచిత్రాలు మా జీవితాలలో అలవాటైపోయినందున , దీనిని  సీరియస్ గా తీసుకుని ఈ రికార్డులు  అన్ని కరెక్టేనా కాదా అని వాకబు చేసే తీరుబడి ఎవరికీ లేదు . మేమంతా  ఆధార కార్డ్లు  రాలేదనీ , గ్యాస్, పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయో అన్న భయంతో చస్తున్నాం . సో మీరు హ్యాపీ గా ఇలాంటి సినిమాలు తీసి మా పైన వదలండి . రికార్డులు బద్దలు గొట్టండి . మేము చూసి తరిస్తుంటాం 

సర్వేజనా సుఖినోభవంతు ..

P .S : పైన పేర్కొన్న అభిప్రాయము  నా వ్యక్తిగతమైనది . ఎవరిని కించపరచాలని  గాని, వెక్కిరించాలని కాని రాసినది కాదు . రాజ్యాంగము నాకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కు ను వాడుకుని  , నా భావమును ప్రకటించ డమైనది . నమస్కారం