27, ఏప్రిల్ 2012, శుక్రవారం

దమ్ము - ( My  take )

 " ఏంటిరా నువ్వు చేసిన పని ? 
" జనం క్షేమం కోసం ఒకడిని చంపాను "
" అయితే  ఈ రోజు నుంచి మన రెండు వంశాల మధ్య  ఎటువంటి సంబంధాలు ఉండకూడదు . ఒకరిని ఒకరు చంపుకోవటమే . ఈ పోరాటంలో ఓటమి ఎవరిదో , గెలుపెవరిదో తేల్చుకుందాం ".

ఆ సంఘటనతో ఆ రెండు వంశాల మధ్య 45 ఏళ్ళు  పోరాటం జరిగింది . నిరంతరం ఆ ఊరిలో యుద్ధం జరుగుతూ  కాష్టం రగులుతూనే ఉంది . ఒక రోజు ఆ రెండు వంశాల శ్రేయస్సును కోరుకునే  ఒక పెద్దమనిషి ఒక  రాజీ  ప్రయత్నం చేసాడు . దాని ప్రకారం ఇక రోజూ చంపుకోవటం ఆపేసి  సంక్రాంతి సమయంలో ఒక రెండురోజులు ఒకరిని ఒకరు చంపుకోవచ్చు . అందులో ఓడిన వారు గెలిచిన వారికి దాసోహం . దానికోసం ఆ పోరాటానికి ముందు ఒకరికి ఒకరు తాబూలం ఇచ్చి  చంపుకోవ టానికి  అగ్రీమెంట్ చేసుకుంటారు . అలా తాంబూలం మార్చుకోవటం మొదలుపెట్టి సినిమా చివరి వరకూ తాంబూలాలు మార్చు కుంటూనే  ఉన్నారు .సో ఈ సినిమా కు బోయపాటి శ్రీను గారు  " దమ్ము " అని పెట్టకుండా  " తాంబూలం " అని పెట్టి ఉంటె బావుండేది అని నా ప్రగాడమైన నమ్మకం .

ఇక పేర్లు పడిన తరువాత .. ఎవడో రౌడీ  ఇంకెవడో బిజినెస్ మాన్ ను బెదిరించి చంపాలనుకుంటూ ఉంటె , మన NTR  గారు ఒక పెద్ద బిల్డింగ్ 5 వ అంతస్తు నుంచి  సునాయాసంగా ఒక కార్ మీదకు దూకి , వచ్చిన 20 మంది ని  ఈక బరాబర్ అన్నట్లు చితగ్గోట్టేస్తారు . షరా మామూలుగా హీరో గారు అనాధ . అతనికి ఫ్రెండ్ అలీ గారు . అక్కడనుంచి హీరో గారు త్రిష గారిని చూసి మొదటి చూపులోనే ప్రేమించేస్తారు . కట్ చేస్తే పాట. మళ్ళి రబ్బరు బాండ్ ను సాగదీసి వదిలినట్లు  కంపోస్ చెయ్యబడిన స్టెప్పులతో పాట ను ముగించగానే , కోట శ్రీనివాస రావు గారు  హీరో గారిని దత్తత తీసుకుంటారు . హీరో గారు ముందు చెప్పబడిన వంశపు ఆచారమైన తాంబూలం తీసుకోవటానికి  వెళ్ళిపోతారు .  ఇంటర్వల్ లోగా  ఒక 2764 మంది కాళ్ళు చేతులు విరగ్గోట్టేస్తారు . అక్కడ హీరో గారికి మరదలు వరసలో రెండో హీరోయిన్ వచ్చేస్తుంది . త్రిష గారు కూడా అక్కడకు వచ్చేస్తారు . బోయపాటి గారు  స్క్రీన్ప్లే అలా నడిపించారు . మీ ఊహ కరెక్టే ..ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ లు  హీరో గారి కోసం తాపత్రయ పడిపోతున్నారు . వెంటనే  మళ్ళి రబ్బర్ బాండ్, పోలియో రీ మిక్స్ తో ఒక  అదరగొట్టే పాట . విలనేమో ఎంత సేపు తాంబూలం తీసుకోవాలని తాపత్రయం తప్ప ఇంకో ఆలోచన లేకుండా గడిపేస్తున్నాడు . ఈ లోగా ఇంటర్వల్ అయింది . 
టీ తాగి , 70 రూపాయలు వదిలించుకుని ఒక పాప్ కార్న్ కొనుక్కుని మళ్ళీ సినిమాలో లీనమయ్యాను . ఇక చూస్కోండి . వంశాల కోసం మనకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హీరో గారు.  ఈ మధ్యలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది . బోయపాటి గారు "అడవిలో అందగత్తెలు " సినిమా ను చాల సార్లు చూసి ఇన్ స్పయిర్  అయినట్లున్నారు . అందుకే సినిమా లో ప్రతీ సీన్ లో  ఆఖరకు ఎంత ఎమోషనల్ సీన్ అయిన సరే హీరోయిన్ ల బొడ్డును , తొడలను చూపించకుండా ఒక్క సీన్ కూడా తీయలేదు . బోనస్ గా " బయటకు తియ్యి కడుగుతా " , " నన్ను యూస్ చేసుకో "," నన్ను వాడుకో " లాంటి ఆధ్యాత్మిక  సంభాషణలు పవిత్రంగా హీరొయిన్ ల చేత పలికించారు . మళ్ళీ మన కంటికి విందు నివ్వాలనే ఉద్దేశ్యంతో  చివరి పాట  ఇద్దరు హీరోయిన్ లు, ఇద్దర్ ఐటెం భామలను పెట్టి మొత్తం నలుగురితో  కలిపి ఒక మసాల పాట ను కూడా పెట్టి  మన జన్మను ధన్యం చేసారు . చివరికి బోలెడు పోరాటం తరువాత ,ఎంతో మందిని చంపి  విలన్  మనసు మార్పించి తన దమ్ము ను చూపించి సినిమాను ముగించి మన కళ్ళు తెరిపించారు హీరో గారు . 

ఇక కీరవాణి గారు అప్పుడెప్పుడో తేజ గారు తీసిన జయం సినిమాలో ని వీరి వీరి గుమ్మడిపండు ..వీరి పేరేమి  అనే పాట ను  యదేచ్చగా స్వంతం చేసుకుని  ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు గా వాడుకున్నారు .  మీరు వర్ధిల్లాలి . ఇక కామెర కోసం చెప్పక్కర్లేదు . ఇలాంటి సినిమాలకు ఇలా ఉండాలి అన్న ఫార్ములా ను పాటించారు  కెమెరా మాన్ గారు .  

మొత్తంగా చెప్పాలంటే  దాదాపు 30 డ్రమ్ముల రక్తం , 7 వేల మందిదాకా నరుక్కోవటం , మంచి మంచి బొడ్డు క్లోజప్ లు, అర పేజీ కు తగ్గకుండా వంశాల కోసం డైలాగులు (బోలెడు సార్లు ) , ద్వందార్ధాల డైలాగులు , బాంబులు , కత్తులు , గాల్లో ఎగిరే సుమో లు , వేల కొద్దీ జూనియర్ ఆర్టిస్ట్ లు , పువ్వులు , నగలు , భారీ ఫైట్లు , ఐటెం సాంగులు  అనీ కలిపి మిక్సీ లో వేసి రుబ్బి ఈ చిత్ర రాజాన్ని మనమీదకు వదిలిన బోయపాటి వారికి , నటించి మన హృదయాలను కదిలించిన NTR గారికి  శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .

నాకు అనిపించింది రాసాను . చూస్తే మీ ఇష్టం . చూడకపోయినా మీ ఇష్టం . 

సెలవు ...

 





 














 

2 కామెంట్‌లు:

Vamsee చెప్పారు...

soooooper!

Raviteja చెప్పారు...

రివ్యూ బాగుంది