8, ఏప్రిల్ 2013, సోమవారం



బాద్ షా ...... శ్రీను వైట్ల గారి ఆల్ మిక్సర్ ధమాకా 



                    ప్రపంచం మొత్తం మీద 7 కధలు ఉన్నాయి వాటిని అటూ ఇటూ తిప్పి  సినిమాలు తీయాలని ఆ మధ్య పరుచూరి గోపాలకృష్ణ  ఏదో సినిమా ఫంక్షన్ లో చెప్పినట్లు గుర్తు ...  దానిని దర్శకుడు శ్రీను వైట్ల గారు పూర్తిగా తీసుకోకుండా ఒకే కధ తో తీసిన మరో సినిమా ఈ బాద్ షా ... 

                తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసారని కొంతమంది , అబ్బే ఏమి లేదు అని ఇంకొంతమంది , బ్రహ్మానందం లేకపోతే సినిమా వేస్ట్ అని ఇంకొంతమంది , టైం పాస్ అని కొంతమంది చెప్పడం వలన  బుర్ర పాడయ్యి , కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం  చలువ వలన ఇంట్లో కరెంటు పోయి , గాలి లేక  ఎసి కు కక్కుర్తి పడి  సినిమా ధియేటర్ కు వెళ్తే దూల దీరి దుకాణం తెరువబడింది ... 

ఇక కధ  కోసం చెప్పుకోవాలంటే ..... స్టార్టింగ్ లో  షిప్ మీద  వెనకాతల అగ్ని గోళం  మండుతుండగా ., డాన్ బాద్ షా  ఒక ఫైట్ చేస్తాడు .... కట్ చేస్తే  మిలన్ వెళతాడు .. అదేంటో అక్కడంతా తెలుగులోనూ  చక్కగా మాట్లాడుతుంటారు . పాపం తెలుగు హీరోయిన్ లు అందరూ చేసినట్లే కాజల్ అగర్వాల్ ఆంటీ  అక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తుంటారు . మన హీరో గారు అక్కడ ఆమె  ప్రేమను పొందటం కోసం ఏదో నాటకం ఆడుతుంటారు . మధ్యలో రష్యన్ అమ్మాయిలతో  పాము కరిచి చలి జ్వరం వచినట్లు  డాన్సు లతో కొన్ని పాటలు .  ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ .. అందులో బోలెడు కిచడీ  కలిపి పాత సినిమాల్లోని కొన్ని సీన్లు , వైట్ల గారి ట్రేడ్ మార్క్.....   ఎవరినో ఒక సినిమా సెలబ్రిటీ ను కించపరుస్తూ / అనుకరిస్తూ /పేరడీ  చేస్తూ కొన్ని సీనులు . ఈ సరి రామ్ గోపాల్ వర్మ మరియు రాజమౌళి  బలి . 

మళ్ళీ కట్ చేస్తే హాంగ్ కాంగ్ .. అక్కడ అంతా హిందీ మాట్లాడుతుంటారు ... నేను చెప్తున్నది హాంగ్ కాంగ్ వాళ్ళ కోసమే సుమా .... విలన్ హెలికాప్టర్ లో తిరుగుతూ కన్సైన్మేంట్  ను ఎక్కడ కావాలంటే అక్కడ దింపమని వెనకాతల ఉన్న బాగా బలిసిన  గూండాలకు చెప్తూ ఉంటాడు . దానిని మన హీరో ఒంటి చేత్తో సాధించి  హాంగ్ కాంగ్ ను తనకు ఇచెయ్యమని అడుగుతాడు . విలన్ ఇచ్చేస్తాడు . హైదరాబాద్ వచ్చి  పాతికేళ్ళు అయిన తరువాత కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు . కాని మన హీరో ఒకే నెల రోజుల్లో  హాంగ్ కాంగ్ ను  సాధిస్తాడు . హాంగ్ కాంగ్ అంతా అతనిదే . తరువాత అదే విలన్ హీరో తనను మోసం చేసాడని తెలుసుకుని  అతన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు .ఇక మెయిన్ విలన్ కాకుండా ఒక డజన్ మంది విలన్ లు ఉన్నారు . వాళ్ళందరూ ఆజానుబాహువులు ., వాళ్ళందరూ హీరో చేతిలో తన్నులు తింటూ , చచిపోతూ ఉంటారు ...ఫ్లాష్ బ్యాక్ వస్తుంది . అది అయిపోగానే  హీరో , కాజల్ ఆంటీ , మిగతా బాచ్  అందరూ ఇండియా వచేస్తారు .  ఇంటర్వెల్ 
 
ఇంటర్వెల్ తరువాత  బ్రహ్మానందాన్ని  బకర చేసే ప్రోగ్రాం . సినిమా చివరికంతా బ్రహ్మానందం నిజం తెలుసుకునే టప్పటికి లాస్ట్ ఫైట్ . హీరో హీరోయిన్ ల పెళ్లి . శుభం .... 

ఈ మధ్యలో టీవీ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం ఒక ఎపిసోడ్ చూసినా ., ఈ సినిమా చూసినా ఒకటే . ఈ సినిమాకు  ఎన్టీఆర్ అవసరం లేదు . అంత బిల్డప్ అవసరం లేదు . చక్కటి ఉంగరాల జుట్టు తో ఉంటె ఎన్టీఆర్ ను  స్టైలింగ్ పేరుతోమామిడి టెంక నాకినట్లు ఒక  ఎఫెక్ట్ తో హెయిర్ స్టైల్ డిజైన్  చేసారు . సినిమాలో సింహ భాగం ఎన్టీఆర్  బ్లాకు కలర్ ప్యాంటు వేసుకున్నాడు . తమన్ సంగీతం కర్ణ హింస . స స స .. డి స స ..బ బ బ బాద్ శ ..ఇదె బిట్టును అటు తిప్పి ఇటు తిప్పీ  చావ గొట్టాడు ....పాటలైతే  అన్నీ బాగా శ్రద్ధ గా కాపీ కొట్టాడు .   కాజల్ ఎన్టీఆర్ పక్కన అక్కలా ఉంది . బోలెడు తారా  గణం . విషయం తక్కువ .. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువ ... మొత్తానికి శ్రీను వైట్ల  సామను సర్దుకునే  సినిమా ఒకటి తీసాడు .. చూస్తారో చూడరో మీ ఇష్టం .. 

ధియేటర్ లోంచి బయటకు  వస్తున్నప్పుడు ఒకటి అనిపించింది ... ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళ కోసం , ఆడియో ఫంక్షన్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కుర్రాడు ..వాళ్ళ కుటుంబం జ్ఞాపకం వచ్చి మనసు చాల బాధ పడింది 

ఇది ఎవ్వరిని నొప్పించడానికి రాసింది కాదు ... నా మనసు నొచ్చు కోవటం వలన రాసిన  నా వ్యూ ... శ్రీను వైట్ల సినిమా లోంచే ఒక వాక్యం తో ఇది ముగిస్తాను .. 

" ఇలాంటి సినిమాలు చూస్తుంటే  తెలుగు సినిమా చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది "