8, ఏప్రిల్ 2013, సోమవారం



బాద్ షా ...... శ్రీను వైట్ల గారి ఆల్ మిక్సర్ ధమాకా 



                    ప్రపంచం మొత్తం మీద 7 కధలు ఉన్నాయి వాటిని అటూ ఇటూ తిప్పి  సినిమాలు తీయాలని ఆ మధ్య పరుచూరి గోపాలకృష్ణ  ఏదో సినిమా ఫంక్షన్ లో చెప్పినట్లు గుర్తు ...  దానిని దర్శకుడు శ్రీను వైట్ల గారు పూర్తిగా తీసుకోకుండా ఒకే కధ తో తీసిన మరో సినిమా ఈ బాద్ షా ... 

                తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసారని కొంతమంది , అబ్బే ఏమి లేదు అని ఇంకొంతమంది , బ్రహ్మానందం లేకపోతే సినిమా వేస్ట్ అని ఇంకొంతమంది , టైం పాస్ అని కొంతమంది చెప్పడం వలన  బుర్ర పాడయ్యి , కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం  చలువ వలన ఇంట్లో కరెంటు పోయి , గాలి లేక  ఎసి కు కక్కుర్తి పడి  సినిమా ధియేటర్ కు వెళ్తే దూల దీరి దుకాణం తెరువబడింది ... 

ఇక కధ  కోసం చెప్పుకోవాలంటే ..... స్టార్టింగ్ లో  షిప్ మీద  వెనకాతల అగ్ని గోళం  మండుతుండగా ., డాన్ బాద్ షా  ఒక ఫైట్ చేస్తాడు .... కట్ చేస్తే  మిలన్ వెళతాడు .. అదేంటో అక్కడంతా తెలుగులోనూ  చక్కగా మాట్లాడుతుంటారు . పాపం తెలుగు హీరోయిన్ లు అందరూ చేసినట్లే కాజల్ అగర్వాల్ ఆంటీ  అక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తుంటారు . మన హీరో గారు అక్కడ ఆమె  ప్రేమను పొందటం కోసం ఏదో నాటకం ఆడుతుంటారు . మధ్యలో రష్యన్ అమ్మాయిలతో  పాము కరిచి చలి జ్వరం వచినట్లు  డాన్సు లతో కొన్ని పాటలు .  ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ .. అందులో బోలెడు కిచడీ  కలిపి పాత సినిమాల్లోని కొన్ని సీన్లు , వైట్ల గారి ట్రేడ్ మార్క్.....   ఎవరినో ఒక సినిమా సెలబ్రిటీ ను కించపరుస్తూ / అనుకరిస్తూ /పేరడీ  చేస్తూ కొన్ని సీనులు . ఈ సరి రామ్ గోపాల్ వర్మ మరియు రాజమౌళి  బలి . 

మళ్ళీ కట్ చేస్తే హాంగ్ కాంగ్ .. అక్కడ అంతా హిందీ మాట్లాడుతుంటారు ... నేను చెప్తున్నది హాంగ్ కాంగ్ వాళ్ళ కోసమే సుమా .... విలన్ హెలికాప్టర్ లో తిరుగుతూ కన్సైన్మేంట్  ను ఎక్కడ కావాలంటే అక్కడ దింపమని వెనకాతల ఉన్న బాగా బలిసిన  గూండాలకు చెప్తూ ఉంటాడు . దానిని మన హీరో ఒంటి చేత్తో సాధించి  హాంగ్ కాంగ్ ను తనకు ఇచెయ్యమని అడుగుతాడు . విలన్ ఇచ్చేస్తాడు . హైదరాబాద్ వచ్చి  పాతికేళ్ళు అయిన తరువాత కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు . కాని మన హీరో ఒకే నెల రోజుల్లో  హాంగ్ కాంగ్ ను  సాధిస్తాడు . హాంగ్ కాంగ్ అంతా అతనిదే . తరువాత అదే విలన్ హీరో తనను మోసం చేసాడని తెలుసుకుని  అతన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు .ఇక మెయిన్ విలన్ కాకుండా ఒక డజన్ మంది విలన్ లు ఉన్నారు . వాళ్ళందరూ ఆజానుబాహువులు ., వాళ్ళందరూ హీరో చేతిలో తన్నులు తింటూ , చచిపోతూ ఉంటారు ...ఫ్లాష్ బ్యాక్ వస్తుంది . అది అయిపోగానే  హీరో , కాజల్ ఆంటీ , మిగతా బాచ్  అందరూ ఇండియా వచేస్తారు .  ఇంటర్వెల్ 
 
ఇంటర్వెల్ తరువాత  బ్రహ్మానందాన్ని  బకర చేసే ప్రోగ్రాం . సినిమా చివరికంతా బ్రహ్మానందం నిజం తెలుసుకునే టప్పటికి లాస్ట్ ఫైట్ . హీరో హీరోయిన్ ల పెళ్లి . శుభం .... 

ఈ మధ్యలో టీవీ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం ఒక ఎపిసోడ్ చూసినా ., ఈ సినిమా చూసినా ఒకటే . ఈ సినిమాకు  ఎన్టీఆర్ అవసరం లేదు . అంత బిల్డప్ అవసరం లేదు . చక్కటి ఉంగరాల జుట్టు తో ఉంటె ఎన్టీఆర్ ను  స్టైలింగ్ పేరుతోమామిడి టెంక నాకినట్లు ఒక  ఎఫెక్ట్ తో హెయిర్ స్టైల్ డిజైన్  చేసారు . సినిమాలో సింహ భాగం ఎన్టీఆర్  బ్లాకు కలర్ ప్యాంటు వేసుకున్నాడు . తమన్ సంగీతం కర్ణ హింస . స స స .. డి స స ..బ బ బ బాద్ శ ..ఇదె బిట్టును అటు తిప్పి ఇటు తిప్పీ  చావ గొట్టాడు ....పాటలైతే  అన్నీ బాగా శ్రద్ధ గా కాపీ కొట్టాడు .   కాజల్ ఎన్టీఆర్ పక్కన అక్కలా ఉంది . బోలెడు తారా  గణం . విషయం తక్కువ .. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువ ... మొత్తానికి శ్రీను వైట్ల  సామను సర్దుకునే  సినిమా ఒకటి తీసాడు .. చూస్తారో చూడరో మీ ఇష్టం .. 

ధియేటర్ లోంచి బయటకు  వస్తున్నప్పుడు ఒకటి అనిపించింది ... ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళ కోసం , ఆడియో ఫంక్షన్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కుర్రాడు ..వాళ్ళ కుటుంబం జ్ఞాపకం వచ్చి మనసు చాల బాధ పడింది 

ఇది ఎవ్వరిని నొప్పించడానికి రాసింది కాదు ... నా మనసు నొచ్చు కోవటం వలన రాసిన  నా వ్యూ ... శ్రీను వైట్ల సినిమా లోంచే ఒక వాక్యం తో ఇది ముగిస్తాను .. 

" ఇలాంటి సినిమాలు చూస్తుంటే  తెలుగు సినిమా చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది "

 










24, జనవరి 2013, గురువారం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు -  నాకు అర్ధమైన సినిమా 





సంక్రాంతి కి  మన తెలుగు సినిమా పరిశ్రమ మాఫియా పుణ్యమా అని రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. చచ్చినట్లు అవి తప్ప చూడటానికి ఇంకే సినిమాలు లేవు . సరే చూద్దాం అని వెళితే  2 వారాలు అసలు టికెట్లు దొరకలేదు . నా టైం బాగోక  మాదాపూర్ హై టెక్ లో నైట్ షో కు టికెట్ దొరికింది. చాల భారీ అంచనాలతో  రిలీజ్ అవ్వటం. మహేష్ , వెంకటేష్ ఇద్దరూ నటించిన మల్టీ స్టారర్  అవ్వటం, హిట్ టాక్ రావటం తో నేను కూడా చక్కగా భోజనం చేసి  పాన్ దట్టించి ధియేటర్ లో కూర్చున్నా .

ఇక కధ  లోకి వెళితే :

రేలంగి ఇంటిపేరు గల ఒక కుటుంబం . తండ్రికి పేరు లేదు , కొడుకులిద్దరికీ పేర్లు లేవు .  ఆ కుటుంబంలో తండ్రి ఎంతసేపు నవ్వుతూ , తెల్ల చొక్కా వేసుకుని , చెరువు గట్టు మీద  నడుస్తూ, మార్కెట్ లో నడుస్తూ, వచ్చే పోయే వాళ్ళను పలకరిస్తుంటాడు ( నవ్వుతూ ). ఈ  రోల్ ప్రకాష్ రాజ్ గారు పోషించారు .అతనికి ఇద్దరు కొడుకులు . పెద్దవాడు పని చెయ్యటానికి ఇష్టపడడు . అదేంటో పై ఆఫీసర్ కు గుడ్ మార్నింగ్ చెప్పటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తిన్నగా ఉద్యోగం చెయ్యడు . ఉద్యోగం మానేసి ఊరికి వచ్చి మొహం ఎప్పుడూ దిగాలుగా పెట్టుకుని మేడ మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు . చిన్నవాడు  హైదరాబాద్ లో ఉంటాడు . రివ్వుమని ఎప్పుడు పడితే అప్పుడు ఊరికి వచేస్తుంటాడు . వచ్చి అన్నయ్య ను మౌనంగా ప్రేమిస్తుంటాడు . అన్నయ్య గారు ఇతనిని ఇంకా మౌనంగా ఆరాధిస్తూ  ఉంటాడు . ఇద్దరూ ఇలాగె గడుపుతూ ఉంటారు . ఇంట్లో అమ్మగా జయసుధ . ఫ్రేమ్ లోకి వచినప్పుడల్లా వడియాలు పెడుతూ, బట్టలు ఉతుకుతూ, కాఫీ లు  కలుపుతూ , పిల్లలకు కి కుంభాలు వడ్డిస్తూ , నానా  హైరానా పడుతూ ఉంటుంది . ప్రకాష్ రాజ్ చెల్లి కూతురు  సీత  కారెక్టర్  అంజలి వేసింది . ఈ పనీ చెయ్యకుండా ఖా ళీ గా తిరిగే వెంకటేష్ ( పెద్దబ్బాయి ) ఈమె పై జులుం చేలయిస్తుంటాడు .  సీత ఎంత సేపు  తువ్వాలు తేవటం , నవ్వుల మావయ్య బయట నుంచి వస్తే  కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు అందించటం చేస్తూ ఉంటుంది. ఇక  ప్రకాష్ రాజ్ బావ గారు  విజయవాడ లో ఉంటారు  కుటుంబ  పెద్ద  రావు రమేష్ . అతను ఏదో వ్యాపారం చేస్తూ కొంచం బాగా సంపాదిస్తూ ఉమ్మడి కుటుంబం తో హాయిగా కాలం వెల్లదీస్తుంటాడు . వీలైనప్పుడు  రేలంగి కుటుంబం వాళ్ళను పని చేసుకుని చక్కగా ప్రయోజకులు గా ఉండమని సలహా ఇస్తూ ఉంటాడు . ఈ ఒక్క కారణం వలన  రావు రమేష్  అంటే ఎవరికీ పడదు . అంతకు మించి సినిమాలో అతను చేసిన తప్పు ఏమి కనిపించలేదు . కొంత కాలానికి అతను కూడా పలకరించుకుంటే  చాలు ఎం పనీ చెయ్యక్కర్లేదు  అని తెలుస్కుని వీళ్ళతో కలిసిపోతాడు .ఇంతే సినిమా.... ఇందులో కధ  ఇంతే.. దీనిని కధనం తో నడిపించారు .

నాకు అర్ధం కాని కొన్ని విషయాలు :

1. ఎం పనీ చెయ్యకుండా  నవ్వుతూ ఉంటె చాలని ప్రకాష్ రాజ్  రోల్ చెప్తూ ఉంది. కనీసం ప్రకాష్ రాజ్  పొలం పనో, తోట పనో చేయించి నట్లు చూపించిన బావుండేది. మరి ఇద్దరు పని చెయ్యని కొడుకులు, పెళ్ళాం, తల్లి, మేనకోడలు  ఏ  జీవనాధారం తో బ్రతుకుతున్నారో అసలు చెప్పలేదు . మధ్యలో గ్రాండ్ గా  అమ్మాయి పెళ్లి కూడా చేస్తారు . సరే  తాతలు ఇచిన ఆస్తులు ఉన్నాయి అనుకోవటానికి  లేదు. రావు రమేష్  అస్తమానం వీళ్ళు ఉన్నదంతా కరగాబెట్టి పాపర్లు  అయిపోయారని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు .

2. వెంకటేష్ సినిమా మొత్తం ఆముదం తాగినట్లు మొహం పెట్టుకున్నాడు . అతనికి ఎం కష్టం వచ్చింది . పని చెయ్యటానికి బద్ధకం . మాట పడకూడదు . సరే ... బానే ఉంది. కాని ఇంట్లో ఎవరికీ రూపాయి ఆదాయం లేకపోయినా తమ్ముడు ఊరికేల్లినప్పుడల్లా  జేబులో ఖర్చుకు కు నోట్ల కట్టలు పెడుతూ ఉంటాడు . ఈ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది ?

3. మహేష్ బాబు హైదరాబాద్ వెళ్తుంటాడు , ఊరికి వస్తుంటాడు . అన్నయ్యను వదిలి వెల్ల దానికి మనసు రాదు. కనిపించిన ప్రతి  అమ్మాయిని  గోకుతుంటాడు . పనేమైన చేస్తాడ అంటే హైదరాబాద్ లో ఎప్పుడూ రోడ్ల మీద తిరుగుతుంటాడు . అప్పుడప్పుడు ఇంటర్వూస్ కు వెళ్తుంటాడు .

4. సీత అంటే అంజలి ని ఉద్దరించినట్లు  ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు . జీతం లేని పనిమనిషి  కారెక్టర్  ఇచారు సీత అనే పాత్రకు తప్ప. ఒక ఉదాత్తత  ఏమి అన్వయించలేదు .

5. ప్రకాష్ రాజ్ దగ్గర భార్య పిల్లల కోసం మాట్లాడితే , వాళ్ళే చూసు కుంటారు  లేవే  అని అంటూ నవ్వుతుంటాడు . మనుషులు అందరు మంచోళ్ళు అని ఒక ఉచిత  జ్ఞానోపదేశం ఒకటి . చక్కగా పలకరించు కోవాలి అని అందరికి ఉపదేశిస్తూ ఉంటాడు .

6. ఇక పోతే సమంత . రావు రమేష్ కూతురు . మహేష్ బాబు ను ప్రేమిస్తూ ఉంటుంది . వాళ్ళ ఫ్యామిలీ  లో ఉన్న ఆడపిల్లలు ( సమంత కజిన్స్ )  బాగా దూల పురుగులు అన్నట్లు అందరూ  మహేష్ బాబు ను విపిరీతంగా
 కా మించేస్తూ ఉంటారు . దీనికి పేరు నేటివిటీ  అంట. అంటే  తూర్పు గోదావరి జిల్లా లో ఆడపిల్లలు బాగా అడ్వాన్స్డ్ గా ఉన్నారని చూపించటం దర్శకుని ఉద్దేశ్యం కాబోలు .

7. పాపం రావు రమేష్ .. అద్భుతమైన నటనను కనపరిచాడు . కాని సినిమాలో అతనే విల్లన్ . అతను చేసిన పాపం అంతా  వెంకటేష్ ను, ప్రకాష్ రాజ్ ను పని చేసుకుని సంపాదించుకుని  బాగా బ్రతకమని చెప్పటం .  ఈ మాత్రం దానికి అందరూ  అతని మీద  సీరియస్ అయిపోతూ ఉంటారు . వెంకటేష్ అయితే  అతన్ని చూడగానే కోపం తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు . ఎందుకో  నాకైతే అర్ధం కాలేదు . అల అని రావు రమేష్ సంపాదనలో అప్ది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసాడ అంటే అదీ లేదు . చక్కగా  కుటుంబాన్ని వెంటేసుకునిబయట  చక్కగా తిరుగుతూ, కుటుంబాన్ని జాగ్రతగా చూసుకుంటూ , వాళ్లకు అనీ అమర్చి అందులో ఆనందం పొందుతుంటాడు .

8.  తనికెళ్ళ భరణి గారిని, రవిబాబు ను కరివేపాకు ను వాడుకున్నట్లు  వాడుకుని వదిలేసారు . రవి బాబు సినిమా లో ఉండటం అసలు అనవసరం .

9. చివరి రీలు లో నైన వెంకటేష్ కు ఒక ఉద్యోగం వచ్చింది  అన్నది చూపిస్తారనుకుని చాలా ఎదురుచూసాను . నిరాశే మిగిలింది . ఇద్దరు కొడుకులు అలానే ఉన్నారు . వెంకటేష్ కు సీతను అంటే అంజలి  ని ఇచి పెళ్లి చేసారు .. శుభం ....

10. సినిమాకు  " సీతమ్మ వాకిట్లో నవ్వుల మామయ్య పలకరింత"  ..ఊరంతా  పులకరింత అనేది  సబ్ టైటిల్ పెట్టి ఉంటె బావుండేది అని నా వ్యక్తిగత అభిప్రాయము

ఇక సినిమా లో నాకు నచ్చినవి :

మణిశర్మ నేపధ్య సంగీతం . ఆరడుగులున్టాడ .. పాట ( మిక్కి జె మేయర్ ). సినిమా అంతా నిండుగా ఉండటం. మంచి ఫోటోగ్రఫీ .

ఇక ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యిందా అని ఆలోచించగా ..చించగా ..చించగా.. నాకు అర్ధమయ్యింది ఒకటే ...

జనాలు  మంచి  సినిమా కోసం మొహం వాచి  పోయి , వంశాల డైలాగులు విని, సుమోలు , కరంట్ స్థంబాలు

పే లిపోవటాలు  చూసి మొహం మొత్తి , రక్తము ..వంశ ప్రతిష్టలు , తొడలు, బొడ్లు , వికార మైన హాస్యం లేని ఈ సినిమా ను ఎడారిలో  మజ్జిగ  లాగా ఫీల్ అయ్యి హిట్ చేసారని నా నమ్మకం .

మొత్తం మీద మల్లె పువ్వు పూచింది  కాని వాసన రాలేదు ... శ్రీకాంత్ అడ్డాల కు హృదయపూర్వక శుభాకాంక్షలు .

సర్వేజన సుఖినోభవంతు ....