30, మార్చి 2012, శుక్రవారం

3 - Movie review ( My take)

3 - రివ్యూ 

దేశాన్ని , ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన  కొలవెరి పాట తో కావలసిన దానికన్నా ఎక్కువ ప్రచారం పొందిన ఈ సినిమా ... ధనుష్ , శ్రుతి హసన్  సినిమా జీవితంలో ఒక గుర్తు పెట్టుకోదగ్గ సినిమా ....

క్లుప్త్జంగా కధ చెప్పుకోవాలంటే : ఇంటర్మీడియట్ లో మొదలైన ప్రేమకధ . చూపులు , కలుసుకోవటం , ఊసులు , బాసలు , విరహం , ప్రేమ , కామం  అన్నింటికీ  ఫుల్ స్టాప్ పెట్టేటట్లు  పెళ్లి , పెళ్లి తరువాత కొత్త జీవితం . జీవితంలో ఓక్ కొత్త మలుపు . షాక్ ... అంతే .. 3  అంటే ముగ్గురు కారెక్టర్ లు . ధనుష్ ఒకటి, శ్రుతి ఒకటి , మరి మూడవ  కారెక్టర్ ను సస్పెన్సు , షాక్ ను మిళితం చేసి జొప్పించారు సినిమా లో ...

నాకు రెండు ఆశ్చర్యాలు   కలిగాయి సినిమా చూస్తుంటే .. ఈ సినిమా కధను ఎలా చెప్పి  ఆర్టిస్ట్ లను కన్విన్సు చేసి ఉంటారా అని ఒకటి, దానిని అర్ధం చేసుకుని ఆర్టిస్ట్లు ఎలా నటించారా అని ఒకటి . రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఇంట్లో పుట్టిన ఒక అమ్మాయి  మామూలు మిడిల్ క్లాసు అమ్మాయిల  మనోభావాలను తెరకు ఎక్కించటం లో వందకు వంద మార్కులు కొట్టేసింది . శ్రుతి హసన్  అభినయానికి జోహార్లు . కమలహాసన్ లా కాకుండా మోహన్ లాల్  లా చిన్న చిన్న విషయాలను , చాల అందంగా చూపించింది తన నటనలో. 

కధ చిన్నదే , కాని దానిని తెరమీద చూపించిన విధానం గాని, ప్రేక్షకుడి ని ఏదో ఒక పాయింట్ దగ్గర తనను తాను చూసుకునేటట్లు చేయడంలో కాని దర్శకురాలు  విజయం సాధించింది . ధనుష్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి . నేనేమైన చెప్తే తిరుపతి లడ్డు కోసం  చందు స్వీట్స్ వాడు కామెంట్ చేసినట్లు ఉంటుంది .

ఏదో మన పక్కింట్లో జరుగుతున్నట్లు గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచం స్లో అయినా ..మనసుకు హత్తుకుంది . 
ఈ సినిమా కు మ్యూజిక్ ఇచిన అనిరుద్ కు  వెయ్యి మార్కులు. నేపధ్య సంగీతం ఇళయరాజా ను  గుర్తుకు తెస్తే , పాటలు ( కొలవెరి మినహా ) అన్ని కొత్తగా అనిపించాయి .  కధలో ధనుష్ ఫ్రెండ్ గా నటించిన  అబ్బాయి సూపర్ . ఎక్కడా అశ్లీలత కాని , అనవసరమైన ఓవర్ ఆక్షన్ లు కాని లేవు. 

ఈ సినిమా  2 వారాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడితే  తెలుగు ప్రేక్షకులు  దీనిని ఆదరించినట్లు లెక్క. 

మంచి సినిమా చూడాలని అనుకుంటే ఈ సినిమా కు వెళ్ళొచ్చు . అంతే కానీ  మీకు  తొడలు చూపించే  అమ్మాయిలు, ఫారిన్ లొకేషన్ లు,  వాంతులు చేసుకున్నట్లు  అరిచే విల్లన్ లు, మూలసంక ఉన్నట్లు అరిచే హీరోలు , బిల్డప్  డైలాగులు, వారసత్వ ఖ్యాతి ని వివరించే ఊకదంపుడు ఉపన్యాసాలు , బకెట్ ల కొద్దీ రక్తం కావాలంటే మాత్రం ఈ సినిమా కు దయచేసి వెళ్లొద్దు . 

ఈ సినిమా లో ఫీల్ ఉంది, మంచి నటన ఉంది , మంచి సంగీతం ఉంది , తక్కువ డబ్బులతో , పరిమిత వనరులతో తీసిన ఈ సినిమా నా దృష్టిలో  ఎన్నో  సినిమా ల మీద మంచి సినిమా . ఇది  నా అభిప్రాయము . 

సర్వేజన సుఖినోభవంతు