10, నవంబర్ 2012, శనివారం

బొమ్మ  తుపాకి 

నేను ప్రస్తుతం  నివాసముంటున్న  అపార్ట్ మెంట్  కు రాత్రి చేరుకున్నప్పటికి  తొమ్మిది గంటలయ్యింది . బండి పార్క్ చేస్తుంటే   టప్  మన్న శబ్దం వినిపించింది . వెనక్కి తిరిగి చూస్తే వాచ్ మాన్ కొడుకు బొమ్మ తుపాకి తో ఆడుకుంటున్నాడు . దీపావళి దగ్గర పడుతోంది అన్న విషయం అప్పుడే జ్ఞాపకం వచ్చింది . లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ కు చేరుకొని  స్నానం చేసి  నప్పటికీ ఆ జ్ఞాపకం చెరిగిపోయింది . ఆకలి వేస్తుందో లేదో తెలియటం లేదు . కానీ  ఎదో ఒకటి తినాలి కదా . ఎదో తిన్నాను . ఎందుకు తింటున్నామో , ఎప్పుడు తింటున్నామో  తెలియకుండా జీవితం మెకానికల్ గా తయారయ్యింది . పడుకుంటే నిద్ర పట్టలేదు . అమ్మ జ్ఞాపకం వచ్చింది . ఆమెతో మాట్లాడి చాల రోజులయ్యింది . అమ్మతో పాటు కింద బొమ్మ తుపాకి తో ఆడుకుంటున్న కుర్రాడు , దీపావళి గుర్తుకు వచ్చాయి .

దీపావళి అంటే ఒక 25 ఏళ్ళ  క్రితం నాకు వేరేగా ఉండేది . దసరా అయిపోగానే 20 రోజులకు దీపావళి వస్తుంది అనేది ఒక బండ గుర్తు . దసరా అయిపోగానే మర్నాటి నుంచి నాన్నను 2 రూపాయల కోసం అడగటం మొదలు పెట్టేవాడిని . అది కూడా అమ్మ నోటితోనే అడగాలి . నాన్న ను ధైర్యంగా అడిగే సీన్ ఉందా మనకు అసలు . 2 రూపాయల కోసం  కనీసం 4 రోజులు వేచి చూడాల్సి వచ్చేది . నాన్న ఇచ్చిన రెండు రూపాయలను  భద్రంగా మురిసిపోతూ చూసుకుని  బజారుకు వెళ్లి  ఒక గన్ కొనుక్కుని వచ్చిన రోజు మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉండేది . అమ్మ వెనకాతలే తిరుగుతూ  అర్ధ రూపాయి ఇవ్వమని  అలా పోరు పెడుతుంటే అమ్మ 10 పైసలు ఇచ్చేది . నూకరాజు కోటలో  గన్ లో పెట్టె రీల్ అమ్మేవారు . ఒకటి పది పైసలు . అది కొనుక్కుని  ఆ రీల్ను కనీసం గంట  వాడే వాడిని. ఎదిరింటి హరి, పక్కింటి  బాలాజీ , వీధి లోని స్నేహితులు  నాగరాజు, శివాజీ , పురుషోత్తం , శ్రీను అందరం కలిసి మా వీధిలో ఉన్న నూతి గట్టు దగ్గర మనిషికో గన్ పట్టుకుని ఆడుకునే వాళ్ళం . అప్పుడు నేను చిరంజీవి , ఇంకొకడు  బాలకృష్ణ, ఇంకొకడు రావుగోపాల రావు , ఇంకొకడు ఇంకో  దుష్ట  పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు .
రీలు అయిపోగానే బిక్క మొహం వేసుకుని ఇంటికెళ్ళి అమ్మ ను మళ్ళీ బ్రతిమాలుకునే వాడిని . అమ్మకు తెలుసు అర్ధ రూపాయి ఒక్కసారి ఇస్తే నేను తగలబెట్టేస్తానని . పది పైసలు చెప్పున  ర్నాకు ఇస్తూ ఉండేది . మనసులో అప్పుడు ఒకటే కోరిక . ఎవరైనా చుట్టాలు వస్తే బావున్ను అని . చుట్టలోస్తే వెళ్ళేటప్పుడు  మన చేతిలో ఒక రూపాయో రెంద్ర్రూపాయలో పెట్టేవాళ్ళు . వద్దు వద్దు అని బయటకు అంటూ , మొహమాటంగా  అమ్మ వైపు నాన్న వైపు చూసేవాడిని. వాళ్ళు తీసుకో అంటే మనసులో గొప్ప సంబరం గా ఉన్నా బయటకు కనిపించకుండా మేనేజ్ చేసేవాడిని . చుట్టాలు వెళ్ళిపోగానే మనం చుక్కా మార్ . ఆ డబ్బులతో రీళ్ళు , దీపావళి అగ్గిపెట్టెలు, పాము మాత్తర్లు ( వెలిగిస్తే నల్ల గా ఒక గొట్టంలా బయటకు వస్తాయి) కొనుక్కుని అవి అపురూపంగా దాచుకునే వాడిని . మిగతా పిల్లలతో ఉన్నప్పుడు మన దగ్గర  ఏమున్నాయో చూపించి  చిన్న ఫోజ్ కొత్తోచు. అందుకన్న మాట .  మా కుటుంబానికి కొంచం దగ్గర బంధువు ఒక మామయ్య ఉండేవారు . అతను మొట్ట మొదటి ఇంజనీర్ మా ఊరిలో . అతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ఎవరూ అతనితో మాట్లాడే వారు కాదు . మా కుటుంబం ఒక్కటే వాళ్ళతో సన్నిహితంగా ఉండేది . దీపావళి అతను మట్టి కుమ్పీలతో చిచ్చు బుడ్లు తయారు చేసేవారు ( ఇప్పుడు వాటిని ఫ్లవర్ పాట్స్ అంటున్నారు ). స్కూల్ అయిపోగానే  వాళ్ళింటికి వెళ్లి అక్కడే కూర్చునే వాడిని . వాళ్ళు అప్పటికి మంచి సంపాదన పరులు., ప్రభుత్వ ఉద్యోగి కావటంతో వాళ్ళ ఇల్లు  పెద్దగ , మంచి ఫర్నిచర్ తో ఉండేది . పేదరికం వలన ఏర్పడే ఒక ఆత్మ నూన్యతా భావంతో వాళ్ళింట్లో  ముందు గదిలో ఒక మూలకు కూర్చుండే వాడిని. మామయ్యా ఆఫీస్ నుండి రాగానే   మెరిసే బూడిద రంగులో ఉన ఒక పదార్ధం, కొని మట్టి కుమ్పీలతో కూర్చునే వాడు , నేను అతని ఎం కావాలో సహాయం చేస్తుండే వాడిని . తా రోజుల్లో అతను దాదాపు 300 చిచ్చు బుడ్లు తయారు చేసేవారు . చివరి రోజు నాకు ఒక 5 చిచ్చు బుడ్లు , వాళ్ళు కోన దీపావళి సామాన్ల ( క్రాకెర్స్ ) లో కొంచం ఇచ్చేవాళ్ళు . నేను వాటికోసమే దీపావళి సమయంలో వాళ్ళింటికి వెళ్తానని ఆయనకు తెలుసు . దీపావళి కి వర్షం పడకూడదని మనసులో చాల మొక్కుకునేవాడిని . మా నాన్న గారు దీపావళి రోజు  సాయంత్రం బజారు నుండి ఒక కాకరపువ్వోత్తి  ప్యాకెట్ , ఒక అగ్గిపెట్టె ల ప్యాకెట్  ,  5 లక్ష్మి బాంబులు తెచ్చేవారు . అమ్మ ఇల్లంతా కడిగి  బయట వాకిల్లో కళ్ళాపి  జల్లి   సాయంత్రం  6 గంటలకంతా ముగ్గేసి పెట్టేది. నాన్న వచ్చిన తరువాత  చెరుకు ను చిన్న ముక్కలుగా నరికి  , వాటి చివరల్లో  గుడ్డ గతి, వాటిని నూనె లో ముంచి  ఆ ముగ్గు మధ్యలో పాతే వారు . వీధి మొత్తం అలానే  చేసేవారు. వీధంతా ఒక కొత్త కాంతి ఉండేది .  స్థితిమంతులు ఇల్లంతా దీపాలు పెట్టేవారు . వీధి లో మడపం ఎదురుగా ఉన్న నీలకంటం  గారు ఇంటికి, మండపానికి కలిపి దీపాలు పెట్టేవారు . వాళ్ళు దాదాపు 3 గంటల సేపు పటాసులు కాల్చే వాళ్ళు. జాగ్రతగా , పొదుపుగా ఎక్కువ సేపు కాల్చాలనే నా ఆలోచన, వీధిలో మొదటి పటాసు పేలగానే  మాయమైపోఎది . నా దగ్గరున్న పటాసులు  10 నిముషాల్లో అయిపోయేవి .మామయ్య ఇచ్చిన  చిచ్చుబుడ్లు  మాత్రం చాల బాగా కాలేవి . పటాసులు అయిపోగానే చాల నిరాశగా అనిపించేది . కాసేపటికి వీధిలో ఎవరు కాలుస్తున్నారో వాళ్ళ అరుగు దగ్గర నిలబడి తదేకంగా చూస్తూ ఉండేవాడిని . ఆ రాత్రి చాల తృప్తి గా ఉండేది . పటాసులు కలలో కొచ్చేవి .

చాల కాలం తరువాత  నేను మొదటి లక్ష  సంపాదించిన  తరువాత   5 వేల రూపాయల దీపావళి సామాన్లు కొని  దీపావళి జరిపాను . మా ఊరికి వెళ్ళాను . చిచ్చు బుడ్ల మామయ్య ఇంటికి వెళ్ళాను. ఆయన రిటైర్ అయిపోయారు . ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి . ఇప్పుడు తయారు చెయ్యటం లేదా అని అడిగితే అంత తీరిక ఎక్కడిది నాయన అన్నారు .  చిన్నప్పటి విషయాలు  గుర్తు   చేస్తే ఆయన కళ్ళలో ఒక ఉత్సాహం కనిపించింది . వాళ్ళ ఇద్దరి పిల్లలూ వాళ్ళ దగ్గర లేరు .  నేను 5 వేల రూపయల సామాను కాల్చినా నాకు పెద్ద ఉత్సాహం అనిపించలేదు . తరువాత  దీపావళి రెండు రోజులు ఉంది అనగా పిల్లలను తీసుకుని వెళ్లి వాళ్లకు ఇష్టమైన సామాన్లు కొని ఇస్తున్న . కాని ఎందుకో నేను అనుభవించిన  ఆ exisement  నా పిలలు అనుభవించటం లేదు అని అనిపిస్తోంది. చుట్టూ చూస్తే  అపార్ట్మెంట్లు . దీపావళి సాయంత్రం  మొక్కుబడిగా నాలుగు దీపాలు ముట్టించి అందరూ సెల్లార్ లో ఎవరి పార్కింగ్ లో వాళ్ళో , లేకపోతే బయటో  తూ తూ మాత్రం గా కాలుస్తారు . ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అదే ఎక్కువ . పిల్లలు కూడా ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు . మాకు మేమే , మీకు మీరే  చందాన దీపావళి అయిపోతోంది . ఆ తరువాత ఒక స్మశాన నిశ్శబ్దం . మళ్ళీ మర్నాడు పరుగులు,ఆఫీస్ , అప్పులు, స్కాం లు, స్కీం లు , పిల్లల ఫీసులు, ఆసుపత్రి ఖర్చులు , పెళ్ళానికి చీర, చంటోడికి పాల డబ్బా,మీడియా గోల , పాదయాత్రలు , పిజ్జాలు , మల్టీ ప్లెక్ష్ లు , షరా మామూలే . నా చిన్నప్పుడు , ఇప్పడు  దీపావళి ఒకేలా ఉందేమో .. నా దృష్టికి సరిగ్గా కనిపించటం లేదేమో కాని.. ఒకటి మాత్రం నిజం... అప్పుడు ఉన్నదీ , ఇప్పడు లేనిదీ  ఒకటుంది .. దాని పేరు  ఆనందం ...

- కరుణా కుమార్ 














కామెంట్‌లు లేవు: